సమంత హ్యాట్సాఫ్.. అక్కినేని కోడలు గుండెను పిండేసింది
తెర మీద సామాజిక కార్యకలాపాల్లో నటించడం చాలా సులభం. అదే వాస్తవ జీవితానికి వచ్చినట్టయితే సేవ చేయడం సెలబ్రీటలకు చాలా కష్టం. కానీ ఇలాంటి పరిస్థితికి తాను అతీతం అని అక్కినేని ఇంటి కోడలు సమంత నిరూపించుకొన్నది. గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు సర్జరీ చికిత్సను అందించి వారికి పునర్జన్మ కల్పించారు సమంత. సమంత సేవాగుణంపై పలువురు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రత్యూష ఫౌండేషన్‌తో
సినీ నటిగా రాణిస్తూనే అనేక సేవా కార్యక్రమాలతో సమంత ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తున్నారు. ప్రత్యూష స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. తాజాగా ఏపీ ప్రధాన పట్టణం విజయవాడలో 15 మంది పసికందులకు తన సంస్థ ద్వారా గుండెకు సంబంధించిన సర్జరీ చేయించి వారికి ప్రాణదాతగా మారారు.

15 మంది చిన్నారులకు చికిత్స
తాను అందించిన వైద్య చిక్సిత వివరాలను సమంత ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోసారి విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్‌లో ఉచిత గుండె సర్జరీ క్యాంపు నిర్వహించాం. 15 మంది పసికందులకు ఉచితంగా గుండెకు సంబంధించిన వైద్య చికిత్సను అందించాం. వారు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అని సమంత ట్విట్టర్‌లో వెల్లడించారు.

మా దృష్టికి తీసుకురండి..
ఎవరైనా పేదరికంతో బాధపడుతున్న కుటుంబాల పిల్లలు గుండెకు సంబంధించిన సమస్యగానీ, ఇతర ఆరోగ్య సమస్యతో బాధపడితే మా దృష్టికి తీసుకురండి. ఉచితంగా చికిత్స అందిస్తాం. వారి వివరాలను [email protected] అనే ఈ-మెయిల్‌కు తెలియజేయండి.

సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
చిన్నారుల సమస్యపై సమంత స్పందించిన తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తున్నది. సమంతను సేవలను ప్రశంసిస్తూ ఆమె మంచి హృదయంతో చిన్నారుల సమస్యకు స్పందించారు. తన సామర్థ్యం మేరకు ఏన్నో ఏళ్లుగా ఇలాంటి సేవలను చేపడుతున్నారు. సమంతను ఆరాధించకుండా ఉండలేకపోతున్నాను అని గాయని చిన్మయి శ్రీపాద ట్వీట్ చేశారు.

సమంత బ్రాండ్ అంబాసిడర్‌గా
కేవలం ఇలాంటి సేవలే కాకుండా తెలంగాణ చేనేతకు సమంత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న చేనేత కార్మికులకు భరోసానివ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, సమంత ప్రస్తుతం రాంచరణ్ సరసన రంగస్థలం 1985, సావిత్రి బయోపిక్ మహానటి చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా ఓ తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











