భూమిపై నడిచే దైవమే మా అన్నయ్య.. ఆ భయం ఎప్పుడూ కలగలేదు.. చిరుపై నాగబాబు ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవిపై మెగా బ్రదర్ నాగబాబు చూపించే ప్రేమను కొలిచే సాధనం ఈ లోకం పుట్టి ఉండదు. చిరంజీవి కోసం ఓ సైన్యంలా మారుతాడు.. చిరంజీవిపైకి ఎవరైనా వస్తే ఓ ఆర్మీలా అడ్డుపడతాడు నాగబాబు. ఏ వేదికైనా సరే చిరంజీవిని ఆకాశమంత ఎత్తులోనే ఉంచాలని చూస్తాడు. కోరుకుంటాడు. తనకేమీ ప్రత్యేకమైన గుర్తింపు అవసరం లేదనీ, చిరంజీవి తమ్ముడనే పిలుపే చాలని, జీవితాన్ని అన్నయ్యకే అంకితం చేసిన కలియుగ లక్ష్మణుడు నాగబాబు.

కష్టనష్టాల్లో తోడు..
చిరంజీవి మొదటి నుంచి వెన్నంటే ఉంటూ ప్రతీ పనిని చేసేవాడు. సినిమాల వ్యవహారాలను చూసేవాడు. అన్నయ్య కోసం నిర్మాతగా మారాడు. అంజనా ప్రొడక్షన్స్‌ను స్థాపించి చిత్రాలను తెరకెక్కించాడు. తీవ్ర నష్టాల్లో మునిగి ఆత్మహత్య వరకు వెళ్లిన నాగబాబును కాపాడాడు.

ఆ సినిమాతో..
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించిన ఆరెంజ్ సినిమాతో నాగబాబు పూర్తిగా కోల్పోయాడు. నిర్మాతగా నాగబాబును ఆ చిత్రం పాతాళానికి తొక్కేసింది. దాదాపు 20కోట్లు నష్టమొచ్చినట్టు అంచనా. అలాంటి సమయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి తనను కాపాడారని, లేదంటే తాను ఉండేవాడిని కాదని నాగబాబు పదే పదే చెబుతూ ఉంటాడు. అలాంటి నాగబాబు తన అన్నయ్యపై ఉన్న ప్రేమను నేడు తెలియజేశాడు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా నాగబాబు చేసిన ట్వీట్ అందర్నీ గుండెలను తాకుతోంది.

నేను నమ్మే దైవం..
చిరు బర్త్ డేపై నాగబాబు స్పందిస్తూ.. పండుగ మొదలైంది.. కొన్ని మిలియన్ల హృదయాల్లో వెలుగు పంచే స్టార్.. నేను నమ్మే ఏకైక దైవం మా అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రాణాలతో ఈ భూమిపై దేవుడు మనిషిలా నడియాడు అంటే అది మా అన్నయ్యే. ఒక వేళ నువ్వే గనుక లేకపోతే మా జీవితాలు ఇలా ఉండేవే కావని చెప్పుకొచ్చాడు.

ఈ సంపద అంతా నీ శ్రమే..
నీవు చూపించే అనంతమైన ప్రేమ, నిరంతర కఠోర శ్రమ వల్లే నాకు ఈ సంపద కలిగింది. కింద పడిపోతానన్న భయం నాకెప్పుడూ కలగలేదు ఎందుకుంటే నన్ను మళ్లీ పైకి లేపడానికి నువ్ ఉన్నావన్న ధైర్యం నాకుంది. అదే నాకు బలాన్ని ఇచ్చింది.. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే అదే కారణమని నాగబాబు తెలిపాడు.
Recommended Video

వెన్నంటే ఉన్నందుకు..
నా జీవితపు ఒడిదుడుకుల్లో వెన్నంటే ఉన్నందుకు ధన్యవాదాలు. ఇంతకంటే ఎక్కువగా ఏమీ అడగలేను, నేను అడగకుండానే నాకు దొరికిన అతి గొప్ప బహుమతి మీరు. బంధాలు, బంధనాల కంటే ఎక్కువగా ప్రేమను, జాగ్రత్తలను మాకు పంచారు.. మీలోని ఆ గొప్పగుణాన్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానిని నాగబాబు ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











