Padma Sri Mogilaiah రోజు వారీ కూలీగా దర్శనం మొగిలయ్య.. కడుపు నింపని పద్మశ్రీ అవార్డు!
కొద్దిరోజులుగా ఓ జుట్టు నెరిసిన పెద్దాయన , పారతో సిమెంట్, ఇసుక కలుపుతూ, ఇటుకలు మొస్తూ కనిపిస్తున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో వున్న ఆ వృద్ధుడిని జాగ్రత్తగా గమనిస్తే .. ఆయన ఎవరో కాదు మన పద్మశ్రీ కిన్నెర మొగిలయ్య. అదేంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రెటీ, రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం, పద్మశ్రీ పురస్కారం అందుకున్న వ్యక్తి కూలి పనులు చేసుకోవడం ఏంటంటూ సోషల్ మీడియా మొతేక్కిపోతోంది.
పొట్ట కూటి కోసం పాటలు పాడుకుంటూ ఊరూరా తిరిగినా.. అంతరించిపోతున్న కళకు ప్రాచుర్యం కల్పించి జీవం పోశారు కిన్నెర మొగిలయ్య. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ కారణంగా సినిమాటిక్‌గా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు మొగిలయ్య. ఆయన వాయిస్తున్న వాయిద్యం, కళ అత్యంత అరుదైంది కావడంతో మీడియా బాగా ఫోకస్ పెట్టింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి చిన్నా చితకా యూట్యూబ్ ఛానెళ్ల వరకు ఆయన ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేశారు. దాంతో మొగిలయ్య ప్రతిభ, కిన్నెర వాయించే కళకు ఆయన చేసిన సేవ కేంద్రం దృష్టికి వెళ్లడంతో ఏకంగా దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డ్ వరించింది.

ఉన్న డబ్బులు ఖర్చయి పోగా.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో కడుతున్న ఇంటిని మధ్యలోనే నిలిపివేశానని పెద్దాయన ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకులకు ఆరోగ్యం బాలేదని.. మందుల కోసం రూ.7 వేల దాకా ఖర్చవుతోందని .. గత 2, 3 నెలలుగా పెన్షన్ కూడా సరిగా రావడం లేదన్నారు. తనపై ఎంతోమంది సానుభూతి చూపిస్తున్నారు కానీ పని ఇవ్వడం లేదని .. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో కూలీగా మారానని మొగిలియ్య ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలను కలిసి తన సమస్యలను విన్నవించారు కూడా. దీంతో ప్రభుత్వ సాయం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. కానీ ఈలోపే మొగిలయ్య కూలీగా కనిపించడం తెలుగునాట హాట్ టాపిక్‌గా మారింది. మొగిలియ్య పరిస్థితి తెలుసుకున్న పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ సైతం మొగిలయ్యకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
అయితే మొగిలయ్యకు పింఛన్ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలు నిజం కాదన్నారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ. సీపీఆర్వో ఆయోధ్య రెడ్డి కూడా ఐఎఫ్ఎంఐఎస్ రిపోర్టును ఎక్స్ వేదికగా షేర్ చేశారు. మార్చి 31న మొగిలయ్యకు పెన్షన్ చెల్లించినట్లుగా పేర్కొన్నారు. మొత్తం మీద పద్మశ్రీ పురస్కారం అందినంత మాత్రాన గ్రహీతలు ధనవంతులు కాలేరని, ఈ గుర్తింపు కడుపు నింపదని.. కష్టపడితే కానీ తిండి గింజలు దొరకవని మొగిలయ్య జీవితం చెబుతోంది.


Click it and Unblock the Notifications











