స్క్రిప్టులో చాలా మార్పులు చేస్తున్నాం : నాగచైతన్య
నాగార్జున కెరీర్లో చెప్పుకొదగ్గ హిట్ సినిమాల్లో 'హలో బ్రదర్' సినిమాది టాప్ ప్లేస్. నాగార్జున-ఈవివి సత్యనారాయణ కాంబినేషన్లో 1994లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తన తడాఖా చూపించింది. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తూ దేవాగా దొంగ పాత్రలో, రాక్ స్టార్‌గా రవి పాత్రలో ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను అలరించాడు. నాగార్జున తన కెరీర్లో ద్విపాత్రాభినయం చేసిన తొలి సినిమా కూడా ఇదే.
తాజాగా 'హలో బ్రదర్' చిత్రాన్ని మళ్లీ తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నాగార్జున సినీ వారసుడు నాగచైతన్య ఈ చిత్రంలో నటించబోతున్నాడు. తండ్రి లాగే నాగచైతన్య కూడా ఇదే చిత్రం రీమేక్‌లో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయబోతుండటం విశేషం.
నాగార్జున హీరోగా ఇటీవల డమరుకం చిత్రాన్ని రూపొందించిన శ్రీనివాసరెడ్డి ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కామాక్షి మూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నాగచైతన్య చేయబోయే రెండు పాత్రలకు సమంత, తమన్నాలను హీరోయిన్లుగా తీసుకునే ఆలోచనలో ఉన్నారు.
ఇప్పటి ట్రెండుకు, నాగచైతన్య బాడీ లాంగ్వేజ్‌కు తగిన విధంగా స్ర్కిప్టులో మార్పులు, చేర్పులు చేస్తున్నాడు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. మరి తండ్రి సినిమా రీమేక్ నాగచైతన్య కెరీర్‌ను మరింత బలంగా నిలబెడుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం నాగచైతన్య దేవాకట్ట దర్వకత్వంలో ఆటో నగర్ సూర్య చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












