నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేత.. మన్మథుడు భూ కబ్జా చేసింది ఎన్ని ఎకరాలో తెలుసా?
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని నిర్మించిన అక్రమ కట్టడాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గత కొన్నేళ్లుగా ఈ అక్రమ కట్టడంపై అనేక ఆరోపణలు వచ్చినా ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేకపోయింది. అందుకు కారణం ఆయా ప్రభుత్వ నేతలతో నాగ్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలే అనే వాదన వినిపించింది. అయితే తాజాగా హైడ్రా చేపట్టిన కూల్చివేతలో భాగంగా నాగార్జునకు చెందిన కన్వెన్షన్‌పై చర్యలు చేపట్టారు. ఆ వివాదాస్పద కట్టడం వివరాల్లోకి వెళితే..
సినీ హీరో నాగార్జున మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలోని తుమ్మిడి కుంట ప్రాంతంలోని ఓ చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారు అనే ఆరోపణలు అప్పట్లో హరీష్ రావుతో సహా ఇతర టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అయితే ఆ సమయంలో కూల్చివేతకు సిద్దం కావడంతో పార్టీ లోని కీలక నేతతో ఉన్న సన్నిహిత రిలేషన్స్ వల్ల అది ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి.

ఇక తమ్ముడికుంట చెరువును సుమారుగా 3 ఎకరాలు ఆక్రమించారు. 2 ఎకరాలు బఫర్ జోన్‌లో ఉంది. మరో 1.12 ఎకరాలు (Full Tank Level-FTL) చెరువు శిఖం కిందకు వస్తుంది. అయితే చెరువును ఎవరూ ఆక్రమించకుండా 2 ఎకరాలను బఫర్ జోన్‌గా పెడుతారు. కానీ నాగార్జున ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టడం సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి.
అయితే 3.5 ఎకరాల ఆక్రమిత భూమిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయాలని పలు ఫిర్యాదులు వచ్చాయి. కానీ గత ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్టు వ్యవహరించింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూకబ్జాలు, ఆక్రమణలపై దృష్టిపెట్టింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝులిపించింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రముఖులు ఆక్రమించిన స్థలాల్లో నిర్మించిన భవనాలు, ఇతర కన్వెన్షన్లపై దృష్టి పెట్టి కూల్చివేసింది. ప్రస్తుతం కూల్చివేతల వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు నోటీసులు ఇవ్వడం.. చివరకు లాబీయింగ్‌తో లొంగిపోయి వదిలేయడం జరిగింది. కానీ రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంపై హర్షం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











