టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు కలకలం.. యువ హీరోకు ఈడీ నోటీసులు
తెలుగు సినిమా పరిశ్రమను డ్రగ్స్ కేసు వెంటాడుతూనే ఉంది. గతంలో కొందరు సినీ ప్రముఖులను తెలంగాణ పోలీసులు, ఈడీ విచారించిన విషయం తెలిసిందే. తాజాగా కొద్ది రోజుల నుంచి నవదీప్ పేరు మళ్లీ డ్రగ్స్ కేసులో బలంగా వినిపిస్తున్నది. అయితే డ్రగ్స్ కేసు విషయంలో నవదీప్‌కు భారీ దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తున్నది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) అధికారులు హీరో నవదీప్‌కు జారీ చేసిన నోటీసులు వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్‌ను 2017 నుంచి డ్రగ్స్ కుంభకోణం వెంటాడుతున్నది. డ్రగ్స్ కేసులో కొందరు సినీ ప్రముఖులపై చార్జిషీట్ నమోదు చేశారు. ఈ కుంభకోణంలో ఛార్మీ, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్, రవి తేజ, రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్ నవదీప్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత కేసు విచారణ అర్ధాంతరంగా ఆగిపోయింది.

డ్రగ్స్ కుంభకోణంలో హీరో నవదీప్‌కు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. నవదీప్‌ను అక్టోబర్ 10వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు అందించారు. ఇటీవల తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారుల విచారణ అనంతరం నవదీప్‌కు ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌పై గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. డ్రగ్స్ సప్లైయర్స్‌తో సంబంధాలు ఉన్నాయనే కోణంలో నవదీప్‌కు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. సెప్టెంబర్ 14వ తేదీన బెంగళూరులో అరెస్ట్ అయిన నైజీరియన్ డ్రగ్స్ సప్లైయర్స్ అందించిన సమాచారం మేరకు నవదీప్‌ను విచారించేందుకు సిద్దమైనట్టు తెలుస్తున్నది.

డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు నోటీసులు అందించడంపై సినీ వర్గాల్లో కలవరం మొదలైంది. ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయో అనే విషయంపై చర్చనీయాంశమైంది. ఈ కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ ప్రకారం నవదీప్‌కు నోటీసులు అందించినట్టు తెలుస్తున్నది. అయితే ఈ కేసులో నవదీప్ తెలంగాణ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన తర్వాత ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు తీవ్రత మరోసారి బయటకు వచ్చింది.
నవదీప్‌కు నోటీసులు జారీ చేయడంపై ఈడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. నవదీప్‌కు సమన్లు జారీ చేయడం నిజమే. గతంలో డ్రగ్స్ కేసుకు లింక్ ఉన్న వ్యవహారంలో నోటీసులు జారీ చేశాం. గతంలో కూడా రెండుసార్లు సమన్లు జారీ చేశాం. కానీ ఆయన సమాధానం ఇవ్వలేదు. దాంతో మరోసారి నోటీసులు జారీ చేశాం అని అధికారులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











