twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెద్ద హీరోల కుట్ర: రాజశేఖర్‌

    By Staff
    |

    ఎవడైతే.. నాకేంటి? అనే చిత్రంలో చేస్తున్నారు హీరో రాజశేఖర్‌. ఆ సినిమా టైటిల్‌కి తగ్గట్టే ఆయన ధోరణి కూడా ఉందని రాజశేఖర్‌ మాటలు బట్టి అర్థం అవుతోంది. వందకు పైగా సినిమాల్లో నటించి, ఆవేశం, అల్లరిప్రియుడు లాంటి సూపర్‌డూపర్‌ హిట్స్‌ అందించిన హీరో రాజశేఖర్‌ తెలుగు చిత్రపరిశ్రమలో తన కెరీర్‌ మటాష్‌ అయిపోడానికి కారణం కొందరు పెద్ద మనుషులే అంటూ సంచలన ప్రకటన చేశారు.

    యాంగ్రీ యంగ్‌మేన్‌గా తాను రాణిస్తున్న రోజులలో అల్లరిప్రియుడు చిత్రంలో గాయక, ప్రేమికునిగా సాఫ్ట్‌రోల్‌ చేసి హీరో రాజశేఖర్‌ సూపర్‌ హిట్‌ అందించారు. అయితే, విచిత్రంగా ఆ క్రెడిట్‌ మొత్తం దర్శకుడు కె. రాఘవేంద్రరావుకు వెళ్లిపోయింది. పైగా ఆ చిత్రానికి ముందు అవినీతివ్యవస్థపై ఆక్రోషించే యువకునిగా, ధైర్యసాహసాలు గల అధికారిగా పవర్‌ఫుల్‌ పాత్రలు పోషించిన రాజశేఖర్‌కు ఉన్న ఇమేజ్‌ పోయి, కొత్త ఇమేజ్‌ రాక.. కెరీర్‌ మొత్తం పోయింది.

    ఆ చిత్రం చేయడంలో తనకు రిగ్రెట్స్‌ లేవని, అయితే.. పెద్ద హీరోల కుట్ర తర్వాతే జరిగిందని రాజశేఖర్‌ ప్రకటించారు. తన కెరీర్‌ ఒడిదుడుకులలో ఉన్నప్పుడు తమిళంలో ఎ. మురుగుదాస్‌ రూపొందించిన రమణ చిత్రం రీమేక్‌ రైట్స్‌ ఆయన మొట్టమొదట కొనుగోలు చేశారు. అయితే, తెరవెనుక కొందరు పెద్దలు గోల్‌మాల్‌ చేసి.. రమణ రీమేక్‌ రైట్స్‌ను తమ హస్తగతం చేసుకున్నారు. అదే మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఠాగూర్‌ అయి సంచలన విజయం సాధించింది.

    ఆ తర్వాత రాజశేఖర్‌ సామి రైట్స్‌ కొన్నారు. తమిళంలో విక్రమ్‌ చేసిన సామి చిత్రం అక్కడ సెన్సేషనల్‌ హిట్‌ సాధించింది. అప్పటికి విక్రమ్‌కి తెలుగులో మార్కెట్‌ లేకపోవడం, పైగా అది ఒక పోలీస్‌ అధికారి చుట్టూ అల్లిన వైవిధ్యభరితమైన కథ కావడంతో హీరో రాజశేఖర్‌ సహజంగానే సామి చిత్రంపై మనసు పడ్డారు. కానీ మళ్లీ అందులోనూ గోల్‌మాల్‌ జరిగి.. చివరికి సామి చిత్రం తెలుగు రీమేక్‌లో హీరోగా బాలకృష్ణ ప్రత్యక్షమయ్యారు.

    మరో పోలీస్‌ అధికారి కథ - కాకకాక - కూడా హీరో రాజశేఖర్‌ చేయాల్సిందే. అయితే, తెరవెనుక కథ మారి.. ఆ సినిమా కూడా చేతులు మారింది. ఫలితంగా రీమేక్‌ రైట్స్‌ పొందిన శివరాజు, వెంకటరాజులు తమ గీతచిత్ర ఫిలింస్‌ పతాకంపై ఆ చిత్రాన్ని వెంకటేశ్‌తో గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందించారు.

    చేసేది లేక ఎప్పుడో రైట్స్‌ తీసుకుని పెట్టుకున్న ఘాతక్‌ (సన్నీ దేవల్‌) చిత్రాన్ని తెలుగులో ఆప్తుడు పేరుతో రాజశేఖర్‌ స్వయంగా రీమేక్‌ చేసి భారీగా చేతులు కాల్చుకున్నారు. అలా ఒకదాని తర్వాత మరొకటి వరుస వైఫల్యాలు చవిచూసి.. ఎట్టకేలకు మళ్లీ మళయాల చిత్రం - లయన్‌ - రీమేక్‌గా ఎవడైతే.. నాకేంటి? టైటిల్‌తో తెలుగు చిత్రం చేస్తున్నారు.

    చిత్రపరిశ్రమలో హీరోగా తనను కొందరు అణగదొక్కేశారు అని ఆక్రోశించే రాజశేఖర్‌ తన గురించి పరిశ్రమలో మాట్లాడుకునే విషయాలను కూడా తెలుసుకోవాలి. షూటింగ్‌ జరిగే సమయంలో రోజుకు రెండు లక్షల రూపాయలు ఖర్చయ్యే చిత్ర పరిశ్రమలో ఉదయం ఏడు గంటల కాల్‌షీట్‌ ఉంటే మధ్యాహ్నం ఒంటిగంట వరకూ షూటింగ్‌ స్పాట్‌కు రా(లే)ని హీరో మీద నిర్మాతలకు కూడా పైకి చెప్పకపోయినా లోపల అంతో ఇంతో అసహనం ఉంటోంది. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలకు భయం. నాలుగు వేళ్లు పెద్ద హీరోల వైపు చూపిన రాజశేఖర్‌ మరొక వేలు తన వైపు చూపిస్తోందని కూడా గ్రహించాలి మరి. సినిమా ఇండస్ట్రీ తీరే అంత!

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X