తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ డైరక్షన్ లో వెంకటేష్, త్రిష జంటగా నటించిన 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' చిత్రం పెద్ద హిట్టయింది. ఇప్పుడా చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయబోతున్నారు. ఇక్కడ ఆ సినిమాను నిర్మించిన శ్రీ సాయి దేవా ప్రొడక్షన్స్ సంస్థే హిందీలోనూ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే తమిళంలోకి 'యారడి నీ మోహిని' పేరుతో రీమేకై హిట్ టాక్ నమోదు చేసుకుంది. అందులో ధనుష్, నయనతార జంటగా నటించారు. ప్రస్తుతం కన్నడ భాషలోనూ తెరకెక్కుతోంది. జగడం నిర్మాత ఆదిత్య బాబు హీరోగా కన్నడ వెర్షన్ లో నటిస్తూ నిర్మిస్తున్నారు. వీర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.నిర్మాతల్లో ఒకరైన శానం నాగ అశోక్ కుమార్ మాట్లాడుతూ 'కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలు నిండిన కథా చిత్రమిది. అందుకే తమిళ ప్రేక్షకుల్ని మెప్పించింది. వచ్చే యేడాది విడుదలయ్యేలా దీన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాము. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం' అంటున్నారు. అలా 'ఆమాఅవే' అన్ని భాషల్లోకి తనదైన స్టైల్ తో దూసుకుపోతోంది.