twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దసరా పోటీలో సినీదిగ్గజాలు

    By Staff
    |

    ఈసారి దసరా తెలుగు చిత్రపరిశ్రమలో చాలా హాట్‌హాట్‌గా ఉంటుండగా, సినిమా ప్రేక్షకులకు మాత్రం సందడే సందడిగా ఉంటుంది. కారణం.. దసరాకి తెలుగు చిత్రసీమలో దిగ్గజాలైన ముగ్గురు హీరోలు ఒకేసారి తమ చిత్రాలతో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు.

    మెగాస్టార్‌ చిరంజీవి స్టాలిన్‌, నాగార్జున బాస్‌, బాలకృష్ణ శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్‌ చిత్రం వారం వ్యవధిలో వరుసగా విడుదలవుతున్నాయి. తెలుగు సినీపరిశ్రమలో ఇంత పోటీగా చిత్రాలు విడుదల కావడం అనేది ఇటీవలి కాలంలో చాలా అరుదు. సాధారణంగా సమ్మర్‌ సీజన్‌, ఆగస్టు సీజన్‌ మెగాస్టార్‌ చిరంజీవి, డిసెంబర్‌ నెల నాగార్జున, సంక్రాంతి, దసరా సీజన్‌లు బాలకృష్ణ, మధ్యలో మంచి టైమ్‌ చూసుకుని వెంకటేష్‌ చిత్రాలు విడుదలకు ప్లాన్‌ చేయడం పరిపాటి. కానీ.. ఈసారి ట్రెండ్‌ కొత్త రకంగా ఉంది.

    మెగా మెసేజ్‌తో స్టాలిన్‌
    మురుగుదాస్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి స్టాలిన్‌గా తమ అభిమానుల్ని అలరించబోతున్నారు. కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికాధికారి సమాజంలో చెడుని చూసి ఎలా స్పందించాలన్న కథాంశంతో నిర్మితమవుతున్న ఈ చిత్రం చాలా క్వాలిటీగా రూపొందుతోంది. ఠాగూర్‌ వంటి పవర్‌ఫుల్‌ సబ్జెక్టుని అందించిన మురుగుదాస్‌ ఆ తర్వాత గజనీ చిత్రంతో తనేమిటో నిరూపించుకుని మెగాస్టార్‌ని మెప్పించారు. ఆ కథకు పరుచూరి బ్రదర్స్‌ పదునైన సంభాషణలు సమకూర్చారు. ఇటీవల యువరక్తం ప్రవేశించడంతో సినిమాలు తగ్గిన పరుచూరి బ్రదర్స్‌ మళ్లీ తమ సత్తా ఏమిటో తెలియజేయాలన్న కసితో ఈ సబ్జెక్టును చాలా సీరియస్‌గా డీల్‌ చేశారని చెప్పుకుంటున్నారు. మణిశర్మ సమకూర్చిన సంగీతం స్టాలిన్‌ చిత్రానికి ఒక హైలెట్‌ కాగా, త్రిష, చిరంజీవి కాంబినేషన్‌ కొంత ఫ్రెష్‌నెస్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టాలిన్‌ క్లయిమాక్స్‌ సన్నివేశాలను 5000 మందితో, సుద్దాల అశోక్‌తేజ రాసిన పాట నేపథ్యంలో చిత్రీకరించారు. అంజనా ప్రొడక్షన్స్‌ అధినేత నాగబాబు ఇప్పటికి చిరంజీవితో మూడు చిత్రాలు నిర్మించగా, వాటిలో రుద్రవీణ, బావగారూ బాగున్నారా ఎప్పటికీ చిరంజీవి అభిమానులకు గుర్తిండిపోయే చిత్రాలే అయ్యాయి. స్టాలిన్‌ కూడా అంతేవాసి చిత్రం అంటున్నారు నాగబాబు. స్టాలిన్‌ చిత్రం సెప్టెంబర్‌ చివరి వారంలో విడుదల కానుందని తెలుస్తోంది. ఇవి స్టాలిన్‌ విశేషాలు.

    బాస్‌ - ఐ లవ్‌ యూ
    ఒకరకంగా స్టాలిన్‌కి పూర్తి భిన్నమైన చిత్రం నాగార్జున హీరోగా రూపొందిన బాస్‌ చిత్రం. వయస్సు మీరినా వన్నె తగ్గని అందాల హీరో నాగార్జున మహిళా ప్రేక్షకుల మనసు దోచే పాత్రలో అలరించబోతున్నారు. ఆయన సరసన ముద్దుగుమ్మలు నయనతార, పూనమ్‌ బాజ్వా అందాలతో, ఆటపాటలతో కనువిందు చేయబోతున్నారు. దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్యకి సంగీతంలో చక్కని అభినివేశం ఉంది. అంతకుమించి అభిరుచి ఉంది. మనసంతా నువ్వే, నేనున్నాను చిత్రాలను సంగీత ప్రధానంగా రూపొందించడంలో ఆదిత్య కనబరచిన ప్రతిభకు చిత్రపరిశ్రమ నుంచి అనేక ప్రశంసలు అందాయి. బాస్‌ ఆడియో కూడా అద్భుతంగా ఉందని ఇప్పటికే పరిశ్రమ గుప్పుమంటోంది. ఈ ఆడియో నాగార్జున పుట్టినరోజు పురస్కరించుకుని ఆగస్టు 29న విడుదల కావాల్సి ఉండగా కారణాంతరాల వల్ల సెప్టెంబర్‌ 3కి వాయిదా పడింది. బాస్‌ పూర్తిగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. అయితే, వరుస విజయాలను సాధిస్తున్న హీరో నాగార్జున ఇమేజ్‌కి సరిపోయేలా ఈ చిత్రంలో అన్ని హంగులు ఉన్నాయని, ఈ చిత్రం క్లాస్‌తో పాటు మాస్‌ ప్రేక్షకులనూ మెప్పిస్తుందని నిర్మాత డి. శివప్రసాద్‌రెడ్డి చెబుతున్నారు. స్టాలిన్‌ చిత్రానికి ఒక వారం వ్యవధిలో బాస్‌ చిత్రం విడుదలవుతుంది.

    బాలయ్య కొత్త చిత్రం
    బాలకృష్ణ చిత్రాలకు పండుగ సెంటిమెంట్‌ హెవీగా వర్కవుతుంది. దసరా, సంక్రాంతి పండుగలలో గతంలో విడుదలైన బాలకృష్ణ చిత్రాలు బాక్సాఫీసు రికార్డులను తిరగరాసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎన్టీఆర్‌ నటవారసునిగా బ్రహ్మరథం పట్టే పల్లెజనం సినిమా ఏ మాత్రం బాగున్నా తండోపతండాలుగా వచ్చి చూస్తారు. వాకాడ అప్పారావు నిర్మాతగా శ్రీలలితకళాంజలి ప్రొడక్షన్స్‌ చిత్రంలో బాలకృష్ణ ఒక మాస్‌ క్యారెక్టర్‌ పోషిస్తుండగా మొదటిసారి బాలకృష్ణకు యా(ఆ)ంటీగా జయప్రద ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. చాలాకాలం తర్వాత జయప్రద ఈ చిత్రం ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. చంద్రముఖి వంటి మెగా హిట్‌ చిత్రాన్ని అందించిన డైరెక్టర్‌ పి.వాసు బాలయ్యను మాస్‌ గెటప్‌లో కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కన్నడ సంగీత దర్శకుడు గురుకిరణ్‌ ఈ చిత్రానికి మ్యూజిక్‌ అందిస్తున్నారు. సాధారణంగా ఎంతో హంగామాగా నడిచే బాలకృష్ణ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ఈసారి చాలా గోప్యంగా, మీడియాకి దూరంగా సాగిపోతుండటం విశేషం. ఈ చిత్రం గురించి ఎక్కడా ఎటువంటి విశేషాలను నిర్మాతలు వెల్లడించడం లేదు. సెప్టెంబర్‌ చివరివారంలో షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకునే ఈ చిత్రం అక్టోబర్‌ చివరి వారంలో గానీ, నవంబర్‌ మొదటివారంలో గానీ విడుదలవుతుంది.

    ఇవి కాక సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో విడుదలయ్యే చిత్రాలున్నాయి. శివాజీ రెండు చిత్రాలు - సీతారాముడు, టాటా బిర్లా మధ్యలో లైలా, జగపతిబాబు సామాన్యుడు, దర్శకుడు శివనాగేశ్వరావు స్వీయనిర్మాణంలో కొత్త వారితో తీసిన ఫోటో, అరడజను డబ్బింగ్‌ చిత్రాలు ఈ సీజన్‌లో విడుదలవుతున్నాయి.

    ఈసారి ఈ రేసులో జాకీచాన్‌ నటించిన ది మిత్‌ కూడా తెలుగులో డబ్బింగ్‌ అయి తెలుగు హీరోల చిత్రాలతో పోటీ పడుతుండటం విశేషం.

    మరిన్నికథనాలు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X