Adipurush: ప్రభాస్ మూవీకి షాకిచ్చిన హిందూ సేన.. కోర్టులో పిల్ దాఖలు.. వాళ్ల డిమాండ్ ఏంటంటే!
సినీ రంగంలో సాధారణంగా ఎన్నో రకాల వివాదాలు చెలరేగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మత విశ్వాసాలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితే ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీ టీమ్ ఎదుర్కొంటోంది. తాజాగా విడుదలైన ఈ చిత్రంలో హిందూ దేవుళ్లను చూపించిన తీరు బాలేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హిందూ సేన ఈ సినిమాపై పిల్ దాఖలు చేసింది. ఇంతకీ వాళ్లు ఏమంటున్నారు? ఏమి డిమాండ్ చేస్తున్నారు? అనే విషయాలను చూద్దాం పదండి!
ఆదిపురుష్‌గా వచ్చిన ప్రభాస్:యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో వచ్చిన చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో అతడు రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. అజయ్ - అతుల్ దీనికి సంగీతం అందించారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు.

ప్రపంచ వ్యాప్తంగా మేనియా:ఆరంభం నుంచే భారీ అంచనాలను ఏర్పరచుకున్న 'ఆదిపురుష్' మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకుల రాకతో కళకళలాడిపోయాయి. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు.. ప్రపంచ వ్యాప్తంగా 'ఆదిపురుష్' మేనియానే కనిపించింది.
కొన్ని సీన్స్‌పై విమర్శలతో:ప్రభాస్ హీరోగా నటించిన 'ఆదిపురుష్' మూవీ శుక్రవారమే వరల్డ్ వైడ్‌గా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అందుకు తగ్గట్లుగానే టాక్‌తో సంబంధం లేకుండా దీనికి విశేషమైన స్పందన లభించింది. అయితే, ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు మాత్రం విమర్శలకు కారణం అయ్యాయి. ముఖ్యంగా దేవుళ్లను చూపించిన లుక్స్‌పై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆదిపురుష్‌పై కోర్టులో పిల్:'ఆదిపురుష్' మూవీని చూసిన తర్వాత కొన్ని హిందూ సంస్థలు అభ్యంతరకర సన్నివేశాలు ఇందులో ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీరాముడి గెటప్, రావణాసురుడి పది తలలు వెరైటీగా ఉండడం, సీతమ్మను కొంచెం గ్లామరస్‌గా చూపించడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలోనే హిందూ సేన అనే సంస్థ ఢిల్లీలోని హైకోర్టులో ఈ సినిమాపై శుక్రవారమే పిల్ దాఖలు చేసింది.

పిల్‌లో ఏం పేర్కొన్నారు?:ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను వీక్షించిన తర్వాత హిందూ సేన ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌లో 'ఆదిపురుష్ సినిమాలో రాముడు, రావణుడు, సీత, హనుమంతుడిని అలా చిత్రీకరించడం సరికాదు. వాళ్లను చూపించిన తీరు ఎంతో అనుచితంగా ఉంది. రామాయణంలో కనిపించే మతపరమైన పాత్రల వర్ణనలకు ఈ చిత్రం చాలా విరుద్ధంగా ఉంది' అని పేర్కొంది.

హైకోర్టును ఏం కోరారు?:హిందూ సేన దాఖలు చేసిన పిల్‌లో హైకోర్టు ముందు ఓ అభ్యర్ధనను ఉంచారు. అందులో 'హిందూ దేవుళ్లైన శ్రీరాముడు, రావణుడు, సీత, హనుమంతునికి సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలి. ముఖ్యంగా హిందూ బ్రాహ్మణ రావణుడు తప్పుడు పద్ధతిలో భయంకరమైన ముఖాన్ని చూపించాడు. ఆ సీన్స్ తొలగించాలి' అని కోరారు.


Click it and Unblock the Notifications











