ఆ ఐడియా బాగా నచ్చేసిందన్న రాజమౌళి.. అందుకే వచ్చా అంటూ అనుష్క కామెంట్స్
నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై రూపొందిన కొత్త సినిమా HIT. నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి జంటగా నిర్మించిన ఈ చిత్రంలో విశ్వక్‌సేన్, రుహానీ శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించగా, వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఫిబ్రవరి 28న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి పోతే..

గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. రాజమౌళి, రాఘవేంద్ర రావు
HIT ప్రమోషన్స్‌లో భాగంగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కి చిత్రయూనిట్ సహా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, దర్శకధీరుడు రాజమౌళి, స్వీటీ అనుష్క ముఖ్య అతిథులుగా విచ్చేసి సందడి చేశారు.

ఆలోచన బాగుంది.. తొలిసారి అక్కడ చూశా: రాజమౌళి
ఈ సందర్భంగా వేదికపై రాజమౌళి మాట్లాడుతూ HIT మేకర్స్‌పై ప్రశంసలు గుప్పించారు. టీజర్, ట్రైలర్ స్టైలిష్‌గా ఉన్నాయని.. ‘స్నీక్‌పీక్' అనే ఐడియా తనకు చాలా నచ్చిందని అన్నారు. ఇలాంటి ఆలోచన తొలిసారి ఇంగ్లిష్ సినిమా ‘2012'కి సంబంధించి చూశానని.. సినిమాలోని కీలక సన్నివేశాన్ని ముందే విడుదల చేయడంతో ఆ తరవాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీతో అందరూ థియేటర్లకు వెళ్లారు. అలాంటి ఐడియాతోనే ‘హిట్'లో కూడా ఓ కీలక ఘట్టాన్ని విడుదల చేశారు. ఈ సినిమా తప్పకుండా హిట్టవ్వాలని అన్నారు రాజమౌళి.

ఎంత నమ్మకముంటే నాని ఇలా చేస్తాడు: రాఘవేంద్రరావు
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ''అ సినిమాతో నాని నిర్మాతగా మారి.. ఇప్పుడేమో ‘HIT' అంటున్నాడు. సినిమాపై ఎంత నమ్మకముంటే ఆ పేరు పెడతాడు. చాలా సినిమాలు చేశాడు కదా.. కొన్ని ఆడతాయి, మరికొన్ని ఆడవు. ఆడని వాటిలోని తప్పులు అదేవిధంగా ఆడిన వాటిలోని బెస్ట్ తీసుకుని రూపొందించి.. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ‘హిట్' అని పేరు పెట్టేశాడు నాని. మొత్తంగా ఓ డాక్టర్ (శైలేశ్) ని డైరెక్టర్ చేసేశాడు నాని'' అన్నారు.
Recommended Video


అతిథిగా రాలేదు.. అందుకే వచ్చా: అనుష్క
అనుష్క మాట్లాడుతూ తాను ఇక్కడికి అతిథిగా రాలేదని.. నాని, ప్రశాంతి తన కుటుంబసభ్యులే అని చెప్పింది. నాని నిర్మించిన ‘అ!' చాలా మంచి సినిమా. నాకు చాలా బాగా నచ్చింది. రెండో సినిమా చాలా మంచి కథతో వస్తారనుకుని వేచి చూశా. ఇప్పుడదే జరిగింది. ‘HIT' ట్రైలర్స్, పాటలు బాగున్నాయి. అందరికీ ఆల్ ది బెస్ట్.. అని చెప్పింది అనుష్క.


Click it and Unblock the Notifications











