మహేష్, బన్నీ అభిమానుల రచ్చ రచ్చ.. మొగుడు, మగాడు అంటూ ఒకరిపై ఒకరు!
స్టార్ హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబు మధ్య నెలకొన్న సంక్రాంతి వార్ రోజు రోజుకూ ముదురుతోంది. మొన్నటిదాకా ఈ ఇద్దరి సినిమాల మధ్యనే వార్ నడుస్తుందని అనుకున్నాం. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఇందులో అల్లు అర్జున్, మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఎంటరయ్యారని స్పష్టమవుతోంది. ఈ మేరకు వైజాగ్‌లో జరిగిన ఓ ఉదంతమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. వివరాల్లోకి పోతే..

మహేష్ బాబు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ
వైజాగ్‌లోని సంగం థియేటర్ వద్ద మహేష్ బాబు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఒకరి సినిమా బ్యానర్లను మరొకరు చించుతూ సినీ వర్గాల్లో సంక్రాంతి వార్‌ని హాట్ టాపిక్ చేసేశారు. ఉదయం మహేష్ బాబు పోస్టర్స్, మధ్యాహ్నం అల్లు అర్జున్ పోస్టర్స్, సాయంత్రం చూస్తే ఏ పోస్టర్ కూడా లేకపోవడం అక్కడి జనం గమనించారు.

'సరిలేరు నీకెవ్వరు' బ్యానర్.. ఆవేశంతో బన్నీ ఫ్యాన్స్
ముందుగా మహేష్ ఫ్యాన్స్ 'సరిలేరు నీకెవ్వరు' బ్యానర్ కట్టారు. అయితే దానిపై ఆ సినిమా టీజర్‌లో ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్..''అన్ని సంక్రాంతులకు అల్లుల్లోస్తారు. కానీ ఈ సంక్రాంతికి మొగుడొస్తునాడు'' ముద్రించారు. దీంతో ఈ పోస్టర్ చూసిన బన్నీ అభిమానులు ఆవేశంతో.. అదే పోస్టర్ స్థానంలో అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' పోస్టర్ పెట్టారు.

మహేష్ అభిమానులను రెచ్చగొట్టేలా..
అంతేకాదు మహేష్ అభిమానులను రెచ్చగొట్టేలా 'అల.. వైకుంఠపురములో' పోస్టర్‌పై ''ఈ సంక్రాంతికి వచ్చేది మొగుడు కాదు మగాడు'' అంటూ క్యాప్షన్ పెట్టేశారు. దీంతో వెంటనే మహేష్ బాబు ఫ్యాన్స్ రంగంలోకి దిగి 'అల.. వైకుంఠపురములో' పోస్టర్ చించి పారేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంక్రాంతి వార్.. ఇరు చిత్రాల దర్శకనిర్మాతలు
మొత్తానికైతే ఈ సంక్రాంతి వార్ పెద్దదైందని స్పష్టంగా తెలుస్తోంది. హీరోలు, సినిమాల మధ్యనే వార్ అనుకుంటే.. అది కాస్తా ఫ్యాన్స్ మధ్య కూడా గొడవలకు తావిస్తోంది. చూడాలి మరి ఇలాంటి ఘటనలపై ఇరు చిత్రాల దర్శకనిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారనేది.

అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో'
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో రూపొందుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తోంది. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' రూపొందింది. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











