రాములమ్మ రీఎంట్రీ అదిరింది.. సరిలేరులో విజయశాంతి రెమ్యునరేషన్ ఎంతంటే..
టాలీవుడ్‌లో లేడీ అమితాబ్ విజయశాంతి రీ ఎంట్రీ ఘనంగానే ప్రారంభమైంది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో తెలుగు తెర రాములమ్మ పోషించిన భారతీ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 13 ఏళ్ల తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకొన్న విజయశాంతి తన నటనలో సత్తా ఏమాత్రం తగ్గలేదనే మాట మీడియాలో బలంగా వినిపిస్తున్నది. ఇక విజయశాంతి తీసుకొన్న రెమ్యునరేషన్ వివరాల్లోకి వెళితే..

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతి
సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ప్రధానమైనమైన పాత్రల్లో ప్రొఫెసర్ భారతీ పాత్ర ఒకటి. ఈ పాత్రలో విజయశాంతి ఒదిగిపోయానేది వాస్తవం. అంతేకాకుండా భారీగా పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ప్రేక్షకుల చేత విజయశాంతి చప్పట్లు కొట్టించారు. 13 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైన కనిపించినా పాత్ర పరంగా రాజసాన్ని బాగా పండించారు.

తొలుత నిరాకరణ.. ఆ తర్వాత
ఇక రాములమ్మ విజయశాంతి తొలుత భారతీ పాత్రను పోషించడానికి ఒప్పుకోలేదని, దర్శకుడు అనిల్ రావిపూడి పలుమార్లు ఆమెను కలిసి పాత్ర తీరుతెన్నులను వివరించడంతో ఆమె అంగీకరించారని తాజాగా సినిమా ప్రమోషన్లలో వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం భారీగానే రెమ్యునేరేషన్ ఆఫర్ చేయడం వల్ల విజయశాంతి సినిమాలో నటించడానికి ముందుకొచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినికిడి.

విజయశాంతి రెమ్యునరేషన్ ఎంతంటే
భారతీ పాత్ర కోసం విజయశాంతికి అక్షరాల రూ.1.5 కోట్ల రెమ్యునరేషన్ (జీఎస్టీ మినహాయించి) ఇచ్చినట్టు సమాచారం. ఓ రీఎంట్రీ హీరోయిన్‌కు ఈ రేంజ్‌లో పారితోషికం ముట్టజెప్పిన దాఖలాలు లేవనే విషయాన్ని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే ఊపులో భారీ రెమ్యునరేషన్‌తో మరికొన్ని సినిమాలు అంగీకరించే ప్రయత్నంలో విజయశాంతి ఉన్నట్టు సమాచారం.

భారీగా ఆఫర్లు
సరిలేరు నీకెవ్వరు చిత్రం రిలీజ్ తర్వాత విజయశాంతిపై సగటు ప్రేక్షకులు, సినీ విమర్శకులు, సినీ వర్గాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఫ్యాన్సీ రెమ్యునరేషన్‌తో పలు ఆఫర్లు ఆమెను పలకరిస్తున్నాయనేది తాజా సమాచారం. అయితే తన స్థాయికి తగ్గ పాత్రలే చేయాలనే ఆలోచనలో వెండితెర రాములమ్మ ఉన్నట్టు తెలుస్తున్నది.

రూ.200 కోట్ల వసూళ్ల దిశగా
ఇదిలా ఉండగా, సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. నైజాంలో నాన్ బాహుబలి రికార్డును అధిగమించేందుకు పరుగులు పెడుతున్నది. ఇప్పటికే రూ25 కోట్లకుపైగా వసూళ్లను రాబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 160 కోట్లకుపైగా గ్రాస్, రూ.100 కోట్ల షేర్‌ను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











