పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
ఏ రంగంలోనైనా ప్రస్తుతం చర్చ జరుగుతున్నదంటే.. అది ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల గురించే. ఏ పార్టీ గెలుస్తుంది? ఎంత మెజారిటీతో గెలుస్తుంది? ఫలానా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఇలా రకరకాల ప్రశ్నలతో చర్చా కార్యాక్రమం ఓ వైపు మరో వైపు వాదనలు, వాగ్వాదాలు గట్టిగానే జరుగుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే.. సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా హాట్ హాట్‌గా జరుగుతున్న ఏకైక అంశం పిఠాపురం నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానానికి ఎన్నిక. ఎందుకంటే.. ఈ స్థానం నుంచి తెలుగు సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటమే అందుకు కారణం.. ఈ నియోజకవర్గంలో ఆయన గెలుపుపై భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసి రెండు చోట్ల నుంచి ఓటమి పాలయ్యారు. దాంతో ఆయన రాజకీయ ప్రస్థానం ఓ ప్రశ్నార్థకంగా మారిన సంగతి తెలిసిందే. ఓటమిని పెద్దగా పట్టించుకోకుండా ఆయన ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. భవన నిర్మాణ కార్మికులు, ఉద్దానంలో ఆరోగ్య సమస్యలు, కౌలు రైతులకు పరిహారం లాంటి అంశాలతో ఆయన తనకంటూ ఓ ఫాలోయింగ్‌ను ఏర్పాటు చేసుకొన్నారు.

ఇక తాజాగా మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఆయనను ఓడించడానికి అధికార పార్టీ భారీగా ప్లాన్ చేసింది. రకరకాల వ్యూహాలతో ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. అధికార, పార్టీ యంత్రాంగాన్ని బలంగా అక్కడ ఏర్పాటు చేసింది.

అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఎలాంటి ఆలోచన లేకుండా పిఠాపురంలో తన ప్రచారాన్ని పూర్తి చేసి పాజిటివ్‌గా మార్చుకొన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో బిజీగా మారిపోయారు. ఈ సారి ఆయనకు పిఠాపురం ప్రజలు పట్టం కట్టడం ఖాయమని అన్ని వర్గాలు నమ్ముతున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం తమ విజయంపై ధీమాగానే కనిపిస్తున్నది.

ఇదిలా ఉండగా.. పిఠాపురంలో గెలుపు ఎవరిదనే విషయంపై పెద్ద ఎత్తున్న సినిమా పరిశ్రమలో బెట్టింగులు జరుగుతున్నాయి. అయితే పవన్ కల్యాణ్ గెలుపు గురించి పక్కన పెడితే.. ఆయనకు వచ్చే మెజారిటీపై బెట్టింగు రాయుళ్లు పందాలు జోరుగా కాస్తున్నారు. పవన్ కల్యాణ్ విజయంపై కాయ్ రాజ్ కాయ్ అంటూ సవాళ్లు విసురుతున్నారు.

పిఠాపురం అసెంబ్లీ ఎన్నిక, పవన్ కల్యాణ్‌పై లక్షల్లో పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. స్థానికంగాను, హైదరాబాద్, అమరావతి, ఏపీలోని ప్రధాన నగారాల్లో లక్షలు, కోట్ల రూపాయల మేర బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ బెట్టింగుల్లో పవన్ కల్యాణ్ గెలుస్తాడా? లేదా? అనే పక్కన పెట్టి.. ఆయనకు లభించే మెజారిటీ మీదే బెట్టింగుల జోరు కొనసాగుతున్నది. ఆయన విజయం, మెజారిటీ ఏ మేరకు ఉంటుందో కాలమే సమాధానం చెబుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











