హైదరాబాద్ నవాబ్స్ ఇప్పుడు తెలుగులో..
హిందీ, ఉర్దూ కలగలసి దక్కనీ ఉర్దూగా చెలామణీలో ఉన్న హైదరాబాద్ మాండలికంతో ప్రత్యేకంగా ఒక చిత్రం తీయడం పెద్ద సాహసం. అలాంటి సాహసం ఒకసారి చేసి ది అంగ్రేజ్ ద్వారా విజయం సాధించిన టీమ్ తాజాగా రూపొందించిన హైదరాబాద్ నవాబ్స్ సూపర్ హిట్ సాధించి ఇటీవలే హైదరాబాద్‌లో అర్ధ శతదినోత్సవం జరుపుకుంది. ఇదే సందర్భంగా చిత్రం ఆడియోను కూడా ఆవిష్కరించారు. పూర్తిగా హైదరాబాద్‌కు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రం విజయోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నటుడు, నిర్మాత అయిన రామకృష్ణ (ఆర్కే) మాట్లాడుతూ తమ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం విజయం తమ బృందానికి చాలా స్ఫూర్తినిచ్చిందని, దీనితో మరిన్ని ఇదే తరహా చిత్రాలు రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. ప్రముఖ రచయిత వెన్నెలకంటి ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులోకి అనుదిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే మయూరి సంస్థ సహకారంతో హైదరాబాద్ నవాబ్స్ తెలుగు చిత్రాన్ని రాష్ట్రమంతటా విడుదల చేయబోతున్నట్లు ఆర్కే వెల్లడించారు.
ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత విశ్వ సంగీతం సమకూర్చగా, లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించారు. హైదరాబాద్ నవాబ్స్ నగర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే యావత్ రాష్ట్ర ప్రజలను కూడా ఈ చిత్రం అలరిస్తుందని చిత్ర దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications