Allu Arjun : పుష్పరాజ్‌ను వెంటాడుతోన్న కష్టాలు.. అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. విడుదలై నెల రోజుల కావొస్తున్నా ఈ సినిమా ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. ఒక్కొక్క సినిమా రికార్డును తొక్కుకుంటూ ఇప్పుడు అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో దంగల్, బాహుబలి 2 తర్వాతి స్థానంలో నిలిచింది పుష్ప 2. ఈ సినిమా సంగతి ఏమో కానీ.. హీరో అల్లు అర్జున్ మాత్రం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
పుష్ప 2 విడుదలకు ముందు రోజు రాత్రి హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో బెనిఫిట్ షో ఏర్పాటు చేశారు. తన కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే వివాహిత ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ దుర్ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, హీరో వ్యక్తిగత భద్రత సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా ఏకంగా హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. జైలు నుంచి తిరిగొచ్చాక తన ఇంట్లో ఆయన బల ప్రదర్శనకు దిగడం తెలంగాణ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఆ వెంటనే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి నేరుగా అసెంబ్లీలో చేసిన కామెంట్స్ , బన్నీ ప్రెస్ మీట్ , తొక్కిసలాట ఘటనకు సంబంధించిన అసలు వీడియోలు బయటకు రావడంతో అల్లు అర్జున్ సైలెంట్ అయిపోయారు. ఇదే సమయంలో బన్నీ ఇంటిపై రాళ్ల దాడి జరగడం మరింత కలకలం రేపింది.
సంధ్య థియేటర్ దుర్ఘటన నేపథ్యంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు పెద్ద సినిమాలకు టికెట్ల ధరల పెంపు.. స్పెషల్ షో, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చేది లేదని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తేల్చిచెప్పారు. దీంతో ప్రభుత్వానికి - అల్లు అర్జున్ కుటుంబానికి మధ్య దిల్‌రాజు సమన్వయం చేస్తున్నారు. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబానికి రూ.2 కోట్ల సాయం అందించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది.
Police deoartment predicted Allu Arjun is going to visit Sri Tej one year back and issued the notice in 2024 itself. Wow 🫡 https://t.co/Ex8ybm5xef
— Mad Max (@madmaxtweetz) January 5, 2025
పరిస్ధితులు చక్కబడుతున్న దశలో అల్లు అర్జున్ నివాసానికి ఆదివారం మరోసారి పోలీసులు రావడంతో టాలీవుడ్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. రాంగోపాల్ పేట్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి రావొద్దని పోలీసులు నోటీసుల్లో కోరారు. శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అనుమతి కావాలని అల్లు అర్జున్ దరఖాస్తు చేసుకోగా.. పోలీసులు నిరాకరించారు. ఒకవేళ పరామర్శించాల్సి వస్తే తమ సూచనలు పాటించాలని.. అక్కడ ఏదైనా జరగరానిది జరిగితే మీదే బాధ్యత అని అల్లు అర్జున్‌ను పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది.


Click it and Unblock the Notifications











