లక్ష్మీస్ ఎన్టీఆర్: అలసిపోయిన ఆర్జీవీ, హృదయ విదారకమైన ట్వీట్!
Recommended Video

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం రిలీజ్ ఏపీలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఉందని, ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయ స్థానం స్టే విధించింది. సుప్రీం కోర్టుకు వెళ్లినా రిలీజ్ విషయంలో క్లియరెన్స్ రాలేదు. ఈ ప్రయత్నాలతో విసిగిపోయిన రామ్ గోపాల్ వర్మ ట్వీట్టర్లో తన బాధను వ్యక్త పరుస్తూ ఆసక్తికర పోస్టులు పెట్టారు.
ఒక కోతి పిల్లను గొలుసులతో కట్టేసినట్లు ఉన్న పేయింటింగ్‌ను రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. దాన్ని 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో పోలీస్తూ.... హైకోర్టు, సుప్రీం కోర్టులో రిలీజ్ ఆలస్యం అవుతుండటంతో చాలా అలసి పోయినట్లు పేర్కొన్నారు.
హృదయ విదారకమైన పేయింటింగ్, వైరల్ అవుతున్న ఆర్జీవీ ట్వీట్
ఆర్జీవీ షేర్ చేసిన ఈ హృదయ విదారకమైన పేయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘మీ నుంచి అలసి పోయాను అనే మాట వినడం' విడ్డూరంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. కొందరు ఆయనకు మద్దతుగా ట్వీట్స్ చేస్తుండగా... లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వ్యతిరేకించే వారు సెటైర్లు పేలుస్తున్నారు.

ఆర్జీవీ తన బిడ్డ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'ను ఓదారుస్తున్నాడు!
మరో పెయింటింగ్‌లో తల్లి కోతి తన పిల్ల కోతిని ఓదారుస్తున్నట్లు ఉంది. ఆ తల్లి కోతిని ఆర్జీవీతో.... పిల్ల కోతిని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'తో పోలుస్తూ వర్మ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో నెలకొన్న పరిస్థితికి అద్దంపట్టేలా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల ముందు రిలీజ్ లేనట్లేనా?
ఏపీలో పరిస్థితి చూస్తుంటే.... అక్కడ ఎన్నికల ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పోలింగ్‌కు మరో 5 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదని సినీ ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. కీలకమైన సమయంలో రిలీజ్ ఆగిపోవడం పెద్ద నష్టంగా పేర్కొంటున్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, వెన్నుపోటు పర్వం ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కించారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించగా రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు.


Click it and Unblock the Notifications











