ఫేక్... అని తేల్చేసిన శృతి హాసన్
హైదరాబాద్: తనకు ఫేస్‌బుక్‌లో ఎలాంటి పబ్లిక్ ప్రొపైల్ లేదని, తన పేరుతో ఫేస్‌బుక్‌లో దర్శనం ఇస్తున్నవన్నీ ఫేక్ ఐడీలే అని హీరోయిన్ శృతి హాసన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులకు సందేశం పంపింది. తన పేరుతో ఉన్న వాటిని లైక్ చేసి మోస పోవద్దని తన ట్విట్టర్లో పేర్కొంది.
ఈ మధ్య ఫేస్‌బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో సెలబ్రిటీల పేరుతో కుప్పలు తెప్పులుగా ఫేక్ ఐడీలు పుట్టుకు వస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది అభిమానులు వాటిని తమ అభిమాన తారల అఫీషియల్ ప్రొఫైల్ ఐడీ అనుకుని మోస పోతున్నారు. ఇటీవల హీరోయిన్ తమన్నా, వంశీ పైడిపల్లి కూడా ఇదే విషయమై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఇక శృతి హాసన్ సినిమాల విషయానికొస్తే... గబ్బర్ సింగ్ చిత్రంతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకున్న శృతి హాసన్ ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న 'బలుపు' చిత్రంలో నటిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ పొట్లూరి నిర్మించనున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు.
మరో వైపు శృతి హాసన్.. నిఖిల్ అద్వానీ తీయబోయే 'డి డే' సినిమాలోనూ నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇందులో అర్జున్ రామ్‌పాల్ సరసన శ్రుతి కనిపించబోతోంది. మూడేళ్ల కిందట 'లక్' చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన శృతి హాసన్‌కు హిట్ దక్కలేదు. తరవాత మధుర్ బండార్కర్ రూపొందించిన 'దిల్ తో బచ్చా హై జీ' సినిమాలో ఓ హీరోయిన్ గా చేసింది. అయితే అది కూడా ఆమెకు నిరాశను మిగిల్చింది. దీంతో హిందీ సినిమాల వైపు చూడకుండా దక్షిణాదిన తన అదృష్టాన్ని పరీక్షించుకొంది. ఇటీవలే 'గబ్బర్ సింగ్'తో విజయాన్ని అందుకున్న ఈ భామ ఇప్పుడు హిందీలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











