అంత ధైర్యం లేదు: వైరముత్తు లేఖపై రాజమౌళి కామెంట్
హైదరాబాద్: దేశం గర్వించే స్థాయిలో అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించిన ‘బాహుబలి' సినిమాకు భారతీయ ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. దర్శకుడు రాజమౌళికి అన్ని వైపుల నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. సౌతిండియా నుండి రూ. 500 కోట్లు వసూలు చేసిన సినిమాగా ఈ చిత్రం రికార్డుల కెక్కింది.
తాజాగా ‘బాహుబలి' సినిమాకు గాను రాజమౌళి పని తీరును, టాలెంటును మెచ్చుకుంటూ ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రాజమౌళికి ఓ లేఖ రాసారు. ఈ విషయాన్ని రాజమౌళి తన సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్ ద్వారా బయట పెట్టారు.

‘బాహుబలి సినిమాకు సంబంధించి నాకు అనేక మంది నుండి ప్రశంసలు అందుతున్నాయి. కానీ, వైరముత్తు సార్ నుండి ప్రశంసలు అందడం ప్రత్యేకం. ఈ లేఖను స్వీకరించే ధైర్యం నాకు లేదు. ఈ లేఖను నేను కేవలం ఒక లెజెండ్ నుండి అందిన ఆశీర్వాదంగా భావిస్తాను, ఒక గొప్ప టీచర్ నుండి విద్యార్థికి ఆశీర్వాదం అందినట్లుగా...' అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' రూ. 500 కోట్ల వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రేంజిలో కలెక్షన్లు సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫోర్బ్స్ కథనం ప్రకారం...ఇప్పటి వరకు కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే రూ. 500 కోట్ల మార్కును అందుకున్నాయి. హిందీయేతర సినిమాలు రూ 500 మార్కును అందుకున్న దాఖలాలు భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు లేనేలేదు. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3, పికె చిత్రాలు మాత్రమే రూ. 500 కోట్ల మార్కును అందుకున్నాయి.
‘బాహుబలి' తొలి భాగం చూసిన ప్రేక్షకులు.... రెండో భాగం ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్ట్ 2 షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తయింది. మిగతా షూటింగ్ సెప్టెంబర్ నుండి ప్రారంభం కానుంది. 2016లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











