హీరో మహేష్ బాబుకు అనారోగ్యం, అందుకే డుమ్మా!
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఇది ఒకరకంగా షాకింగ్ న్యూస్. మహేష్ బాబు అనారోగ్యం పాలయ్యారు. వాస్తవానికి ఆయన ఈ రోజు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న టీవీఎస్ కంపెనీ తరుపున హైదరాబాద్‌లో జరిగే ప్రచార కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. అయితే ఒంట్లో నలతగా ఉండటంతో ఆయన రాలేక పోయారు.
ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. 'నా అభిమానులు, టీవీఎస్ ఫ్యామిలీని కలవాల్సి ఉంది. కానీ ఒంట్లో కాస్త నలతగా ఉండటంతో రాలేక పోతున్నాను. త్వరలోనే కలుస్తాను' అంటూ మహేష్ బాబు ట్విట్టర్ పేజీలో పేర్కొన్నారు. తాను రాక పోతే రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తాయని ముందు ఊహించిన మహేష్ బాబు స్వయంగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్. 'దూకుడు' తర్వాత మహేష్, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి.
మహేష్ శైలి వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











