బోఫోర్స్ స్కామ్‌లో క్లీన్‌చిట్‌పై అమితాబ్ స్పందన
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు బోఫోర్స్ కుంభకోణంలో క్లీన్ చిట్ లభించింది. ఈ కుంభకోణంపై అప్పట్లో దర్యాప్తు జరిపిన స్వీడన్ మాజీ పోలీసు చీఫ్ స్టెన్ లిండ్‌స్ట్రామ్ ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టారు. ఆయుధ కొనుగోళ్లకు ఉద్దేశించిన ఈ స్కాం వెలుగుచూడటానికి తానే కారణమన్నారు.
ఈ కుంభకోణంలో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ముడుపులు తీసుకున్నారనడానికి ఆధారాలు లేవని, అయితే బోఫోర్స్ స్కాం ప్రధాన సూత్రధారి, ఇటాలియన్ వ్యాపారి అట్టావియో కత్రోచీని రక్షించడానికి భారత్‌లో, స్వీడన్‌లో జరిగిన ప్రయత్నాలను ఆయన అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ఈ స్కాంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు క్లీన్‌చిట్ ఇచ్చారు.
1984 లో అమితాబ్ తన నటజీవితాన్ని కొద్దిగా ప్రక్కకు పెట్టి చిరకాల కుటుంబ మిత్రుడైన రాజీవ్ గాంధీకి మద్దతుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అలహాబాద్ లోక్ సభ స్థానం నుండి అమితాబ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటు వంటి హెచ్.ఎం. బహుగుణతో పోటీపడ్డారు. అప్పుడు జరిగిన సాధారణ ఎన్నికల్లో 68.2% ఓట్లను పొంది అద్భత విజయాన్ని అమితాబ్ సొంతం చేసుకొన్నారు.
అయితే అమితాబ్ రాజకీయ జీవితం చాలా కొద్దికాలం వుంది. మూడు సంవత్సరాల తరువాత రాకీయాలు ఒక మురికి గుంట అని వ్యాఖ్యానించి ఆ పదవికి రాజీనామా చేసారు. ఒక వార్తా పత్రిక బోఫోర్స్ కుంభకోణంలో అమితాబ్, అయన తమ్ముడు అజితాబ్ లు భాగస్వాములని కధనాలను ప్రచురించింది. అమితాబ్ అ పత్రికను కోర్టుకు తీసుకొని వెళ్ళాడు. అయితే బచ్చన్ సోదరులు నిర్దోషులని, బోఫోర్స్ కుంభకోణం లో వారికి సంబంధం లేదని కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా స్టెన్ లిండ్‌స్ట్రామ్ కూడా అమితాబ్ క్లీన్ చీట్ ఇవ్వడంతో అమితాబ్ పై ఉన్న మచ్చ పూర్తిగా తొలగినట్లయింది. ఈ విషయమై అమితాబ్ తన బ్లాగులో స్పందిస్తూ... చాలా లేటుగా ఈవిషయం చెప్పారు. 25 ఏళ్ల తర్వాత అయినా నిజం తేలినందుకు సంతోషంగా ఉందన్నారు.


Click it and Unblock the Notifications











