యూఎస్ వెళ్లాల్సినోడికి... పవన్ సినిమాతో ఆ పిచ్చి!
యువ హీరో నితిన్ జయం సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'దిల్' సినిమాతో హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే ఆ తర్వాత చాలా ప్లాపులు పలుకరించడంతో వెనకబడిపోయాడు. తాజాగా 'ఇష్క్' సినిమా తన స్టార్ ఇమేజ్ ను పెంచి మళ్లీ తన కెరీర్ సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాడు. అయితే వాస్తవానికి నితిన్ సినిమాల్లోకి వస్తానని అనుకోలేదట. కేవలం పవన్ కళ్యాన్ సినిమాలు చూసి హీరో అవ్వాలనే పిచ్చి ఎక్కువై ఇందులోకి దిగాడట.
గురువారం రాత్రి జరిగిన 'ఇష్క్' ఆడియో ఫంక్షన్ లో నితిన్ మాట్లాడుతూ...''నేను ఇంటర్ అయిపోగానే యూఎస్ వెళ్లిపోదామనుకున్నా, సరిగ్గా అప్పుడే 'తొలిప్రేమ' విడుదలైంది. నాకు స్వతహాగా సినిమాలంటే ఇష్టం. కానీ తొలి ప్రేమతో అది పిచ్చిగా మారింది. వారంరోజులు వరుసగా అదే సినిమా చూశాను. ఓ రోజు దర్శకుడు కరుణాకరన్ మా ఇంటికి వచ్చాడు. నువ్వు బాగున్నావ్, నీతో సినిమా చేస్తా అన్నారు. అప్పటి నుంచి ఊహాలోకంలో విహరించే వాడ్ని. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎంత ఇష్టమంటే...నా బర్త్ డే వస్తే ఆ రోజంతా ఆయన ధరించిన టీషర్టులనే వేసుకుంటాను'' అంటూ చెప్పుకొచ్చాడు నితిన్. నితిన్-నిత్య మీనన్ జంటగా కె. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఇష్క్ సినిమా రూపొందుతోంది. విక్రమ్ కుమార్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











