అవును దొంగనే, బాలీవుడ్ రీఎంట్రీపై బ్రహ్మనందం వివరణ
హైదరాబాద్: టాలీవుడ్ కామెడీ డాన్ బ్రహ్మనందం 1999లో అమితాబ్ బచ్చన్-సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన 'సూర్యవంశం' అనే బాలీవుడ్ చిత్రంలో చివరి సారిగా నటించారు. ఆ తర్వాత ఆయన ఏ బాలీవుడ్ చిత్రంలోనూ నటించలేదు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆయన 'వెల్ కం బ్యాక్' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 2007లో వచ్చిన 'వెల్‌కం' చిత్రానికి ఇది రీమేక్.
ఈ వార్తలపై బ్రహ్మనందం స్పందించారు. 'బాలీవుడ్ దర్శకుడు అనీస్ బాజ్మీ ఇటీవల నన్ను సంప్రదించాడు. వెల్ కం బ్యాక్ చిత్రంలో ఓ ఇంట్రస్టింగ్ రోల్ చేయమని చెప్పారు. ఇందులో నేను దొంగ పాత్రలో నటిస్తున్నాను. నేను నటించిన పలు తెలుగు సినిమాలు హిందీలో డబ్ అయ్యాయి. అందులో నా ఎక్స్ ప్రెషన్స్ నచ్చి నాతో సినిమాలో ఈ పాత్ర చేయించాలని డిసైడ్ అయ్యాడట. త్వరలో ముంబై, దుబాయ్ లో జరిగే షూటింగులో పాల్గొంటాను. నేను నటించే సన్నివేశాలు ఎక్కువగా నానా పాటేకర్, అనీల్ కపూర్‌లతో ఉంటాయి' అని తెలిపారు.

ప్రస్తుతం బ్రహ్మానందం తెలుగులో చాలా బిజీ కమెడియన్. వాస్తవానికి ఆయనకు ఇతర సినిమాలు చేసే ఇంట్రెస్టు, సమయం కూడా లేదు. 'నేను ఇప్పటికే తెలుగులో చాలా బిజీగా ఉన్నాను. బాలీవుడ్లో చేయాలనే ఆలోచన కూడా లేదు. అయితే అనీస్ నన్ను కన్విన్స్ చేసాడు. ఆయన చెప్పిన క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. అందుకే ఒప్పుకున్నాను' అని బ్రహ్మానందం వెల్లడించారు.


Click it and Unblock the Notifications











