మహేష్ బాబే టార్గెట్: లిస్టులో ఆ టాప్ డైరెక్టర్
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం తెలుగులో సక్సెస్ ఫుల్‌గా దూసుకెలుతున్న టాప్ హీరోల్లో ఒకరు. మహేష్ బాబుతో ఒక్క చాన్స్ అని ఎదురు చూసే హీరోయిన్లు ఎందరో. అనేక మంది దర్శకులు కూడా మహేష్ బాబుతో సినిమా చేయాలనే అంశాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారు.
అలాంటి దర్శకులు లిస్టులో ఇప్పటికే పలువురు స్టార్ దర్శకులు ఉన్నారు. తాజాగా ఆ లిస్టులో ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ కూడా చేరిపోయారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను మహేష్ బాబుకు పెద్ద అభిమానిని అని, ఆయనతో సినిమా చేయాలనే నా కోరిక వీలైనంత త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

మహేష్ బాబు గురించిన వివరాల్లోకి వెళితే ఆయన ప్రస్తుతం 'ఆగడు' చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో 'దూకుడు' వంటి ఇండస్ట్రియల్ హిట్ ఇచ్చిన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఆగడు'. ఈ చిత్రానికి సంబంధించిన బళ్లారి షెడ్యూల్ పూర్తయింది. మార్చి 10 నుండి హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్ ప్రారంభం అయింది.
ఈ చిత్రంతో పాటు 'మిర్చి' సినిమా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా ఓకే అయినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొరటాల శివ స్క్రీన్ ప్లే వర్క్ మొదలు పెట్టారని సమాచారం. బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ యుటివి వారు ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. సమ్మర్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











