"పార్టీని నడిపించడానికి డబ్బు కావాలి, అందుకే సినిమాల్లో కొనసాగుతా.."
తెలుగునాట పవన్ కళ్యాణ్ 'జనసేన' పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి ప్రజల కోసం పోరాడుతున్నట్లే.... తమిళనాట రజనీకాంత్, కమల్ హాసన్ వేర్వేరు రాజకీయ పార్టీలు స్థాపించిన సంగతి తెలిసిందే. సినిమా రంగంలో సూపర్ స్టార్లుగా ఉన్న వీరు... నటించడం ద్వారా వచ్చే కోట్లాది రూపాయల డబ్బుతో హాయిగా ఉండొచ్చు. కానీ ప్రజలకు మంచి చేయాలని, వారి బ్రతుకులు బాగుచేయాలని తపిస్తూ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అయితే సినిమా రంగంలో కొనసాగడంపై ఈ ముగ్గురూ వేర్వేరు అభిప్రాయాలతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ నటనకు దూరం అవుతున్నట్లు ప్రకటించగా, కమల్ హాసన్ మాత్రం నటుడిగా కొనసాగుతానంటున్నారు.

అందుకే రాజకీయాల్లోకి వచ్చాను
తాజాగా సీఎంసీ మెడికల్ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే మక్కల్ నీది మయ్యం అనే పార్టీని తను ప్రారంభించినట్లు తెలిపారు.

పార్టీని నడిపించడానికి డబ్బు కావాలి
పార్టీని నడిపించడానికి డబ్బు కావాలని, పార్టీ ఖర్చుల కోసం సినిమాల్లో నటిస్తానని కమల్ హాసన్ స్పష్టం చేశారు. సినిమాల్లో నటించినప్పటికీ తన దృష్టంతా రాజకీయాలు, ప్రజలకు సేవ చేయాలనే అంశంపై ఉంటుందన్నారు.

విద్యార్థుల భాగస్వామ్యంతోనే సాధ్యం
విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని, దేశంలో జరుగుతున్న పరిణామాలు, ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థుల భాగస్వామ్యం ఉంటేనే దేశాన్ని మార్చగలమన్నారు.

కమల్ హాసన్
కమల్ హాసన్ సినిమాల విషయానికొస్తే... ఆయన నటించిన ‘విశ్వరూపం 2' మూవీ ఇటీవల విడుదలైంది. మరో వైపు కమల్ నటించిన ‘శభాష్ నాయుడు' మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కమల్ వ్యాఖ్యలు బట్టి ఆయన నుండి ఇకపై కూడా సినిమాలు వస్తాయని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











