నన్ను ముంచారు, పోతా: తమిళనాడుపై కమల్ వ్యంగాస్త్రం

అప్పుడేదో కమల్ హాసన్ ఆవేశంగా అన్నారని అంతా అనుకున్నారు. అయితే తాజాగా ఇదే మాట మరోసారి అన్నారు కమల్ హాసన్. తమిళ చిత్ర రంగంలో నిలదొక్కుకోలేనంతగా వేధిస్తే తమిళనాడును విడచి వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. తాను గతంలో చెప్పిన మాటలు ఉద్వేగంతో అన్నవని, ఇప్పుడు ఆగ్రహంతో అంటున్నానని చెప్పారు. ఆస్తులన్నీ అమ్ముకుని సినిమా తీసానని, తమిళనాడు తనను అప్పుల పాలు చేసిందని కమల్ హాసన్ వ్యంగ్యంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి జయలలితతో సమావేశం తర్వాత తన నిర్ణయం వెల్లడిస్తానన్నారు.
త్వరలో తాను విశ్వరూపం 2 చిత్రం కూడా తీస్తానని చెప్పిన కమల్ హాసన్, ప్రతి ముస్లిం థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని విజ్ఞప్తి చేసారు. సినిమా ఎవరినీ కించ పరిచే విధంగా లేదన్నారు. తనకు అండగా నిలిచిన సహ నటులకు, మీడియాకు కమల్ హాసన్ కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తాను కష్టాల్లో ఉన్న విషయం తెలిసి డబ్బులు, చెక్కులు, ఇళ్ల దస్తావేజులు పంపే అభిమానులు ఉండటం తన అదృష్టంగా పేర్కొన్నారు.
జనవరి 25న విడుదల కావాల్సిన 'విశ్వరూపం' చిత్రం.... ముస్లిం సంఘాల ఆందోళనతో తమిళనాడులో విడుదల నిలిచి పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కమల్ కోర్టు కెళ్లడం, కోర్టులోనూ చుక్కెదురు కావడం, చివరకు ముస్లిం సంఘాలతో చర్చలు జరిపి వారు అభ్యంతరం వ్యక్తం చేసిన సీన్లను తొలగించారు. దీంతో ఎట్టకేలకు నిన్న(ఫిబ్రవరి 7)న సినిమా విడుదయింది.


Click it and Unblock the Notifications











