ఐఫా అవార్డ్స్ 2019: బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్న RRR హీరోయిన్
సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నటీనటులకు ప్రోత్సాహకంగా ఐఫా అవార్డ్స్ ఇస్తూ వస్తున్నారు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్ (IIFA) పేరిట ఇస్తున్న ఈ అవార్డుల ఫంక్షన్ బుధవారం రోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బెస్ట్ యాక్టర్స్ గా ఎవరెవరికి అవార్డ్స్ దక్కాయో చూద్దామా..

ఐఫా అవార్డ్స్ 2019
మహారాష్ట్ర రాష్ట్రం లోని ముంబై నగరంలో ఐఫా అవార్డ్స్ 2019 వేడుక జరిగింది. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. నటీనటులు, డాన్సర్ల డాన్సులతో ఐఫా అవార్డ్స్ వేదిక హోరెత్తింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో నటీనటులకు అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

బెస్ట్ ఫిమేల్ యాక్టర్‌గా
ఐఫా అవార్డ్స్ 2019 బెస్ట్ ఫిమేల్ యాక్టర్ అవార్డు ఆలియా భట్‌ని వరించింది. ‘రాజీ' సినిమాలో ఆలియాభట్ ప్రదర్శించిన నటనకు గాను ఉత్తమ నటి అవార్డు ఆమెను వరించింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డు గెలుచుకున్న ఆలియాభట్ వేదికపై తన ఆనందాన్ని వెల్లడించింది.

ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు
ఇక ఉత్తమ నటుడిగా రణవీర్ సింగ్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డు దక్కించుకున్నారు. 'పద్మావత్' సినిమాలో ఆయన చూపిన అభినయానికి గాను రణవీర్ సింగ్‌ను ఐఫా అవార్డు వరించింది. అదేవిధంగా ‘అంధాధూన్' సినిమా దర్శకుడు శ్రీరాం రాఘవన్‌కు ఉత్తమ దర్శకుడి కేటగిరీలో ఐఫా అవార్డు లభించింది.

ఐఫా బెస్ట్ డిబట్ యాక్టర్స్
ఐఫా బెస్ట్ డిబట్ మేల్ అవార్డు ఇషాన్ ఖట్టర్‌కి దక్కగా, బెస్ట్ డిబట్ ఫిమేల్ అవార్డు సారా అలీఖాన్‌కి దక్కింది. ‘ధడక్' సినిమాలో నటనకు గాను ఇషాన్ ఖట్టర్, ‘కేదార్‌నాథ్' సినిమాలో నటనకు గాను సారా అలీఖాన్ ఈ అవార్డులు అందుకున్నారు. ఇక ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ‘రాజీ' సినిమా ఎంపికైంది. ఈ చిత్రంలో ఆలియా భట్, విక్కీ కౌశల్ నటించారు.

RRR లో ఆలియాభట్
ఆలియాభట్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ఆమె కనిపించనుంది. తెలుగులో ఇదే ఆమెకు తొలి సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


Click it and Unblock the Notifications











