'కందిరీగ' హిందీ రీమేక్ లో ఇలియానా ఖరారు
హైదరాబాద్: తెలుగులో రామ్ హీరోగా వచ్చి ఘన విజయం సాధించిన చిత్రం 'కందిరీగ'. హన్సిక హీరోయిన్ గా చేసిన ఈ సినిమా 'మై తేరా హీరో' పేరుతో హిందీలో రీమేక్ అవుతోంది. డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాలో ఆయన కుమారుడు వరుణ్ ధావన్, ఇలియానా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని 'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఖరారు చేసి చెప్పారు.
సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... ''వాణిజ్యాంశాలతో కూడిన సినిమాల్ని తీయడంలో మన తెలుగు దర్శకులకు తిరుగులేదు. అందుకే మన చిత్రాలు విరివిగా బాలీవుడ్‌కి వెళుతున్నాయి. నేను తీసిన మొదటి చిత్రమే హిందీలో రీమేక్ అవుతుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది. నా అభిమాన దర్శకుల్లో ఒకరు డేవిడ్ ధావన్. ఆయన నా 'కందిరీగ' చిత్రాన్ని రీమేక్ చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.
ఇక 'కందిరీగ' మొదలైన విధానం చెప్తూ... మొదట హీరో గోపీచంద్‌కు ఓ స్క్రిప్టు చెప్పాను. తను ఓకే అన్నాడు. కానీ నాకే సెకండాఫ్‌లో లోపాలు కనిపించాయి. అందుకే ఆయనకు ఆ స్క్రిప్టును మార్చాలని చెప్పి ఇవతలకి వచ్చేశా. డైరెక్టర్‌గా నా మొదటి సినిమా సక్సెస్ కాకపోతే నన్ను పట్టించుకునేవారుండరని తెలుసు. అందుకే సెకండాఫ్‌ని మళ్లీ రాసి, ఈ సారి నిర్మాత బెల్లంకొండ సురేశ్ వద్దకెళ్లి వినిపించాను. ఆయనకు నచ్చడం, రామ్‌కి దాన్ని వినిపించమనడం, రామ్ దాన్ని ఓకే చేయడం, దాంతో 'కందిరీగ' రూపొంది విజయాన్ని సాధించడం.. వరుసగా జరిగిపోయాయి అన్నారు.
తన ప్రస్తుత చిత్రం రభస గురించి చెప్తూ... ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్లు 'రభస'ని మాస్ అండ్ ఎనర్జిటిక్ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబోతున్నా. హీరో కేరక్టర్‌లో నాలుగు ఛాయలు కనిపిస్తాయి. కథ వినగానే 'ఎక్సలెంట్' అన్నారు ఎన్టీఆర్. ఇక దాన్ని బాగా తీసే బాధ్యత నాదే. 'రభస' ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో. ఆయనలేని సన్నివేశం ఉండదు. మెయిన్ హీరోయిన్‌గా సమంత చేస్తోంది. ఆమెదీ మంచి పాత్ర. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ఆగస్ట్ 2న షూటింగ్ మొదలవుతుంది. కథ విషయంలో కానీ, మేకింగ్ విషయంలో కానీ బెల్లంకొండ సురేశ్ ఏమాత్రం రాజీ పడరు. సినిమాకి ఏం అవసరమో అవన్నీ సమకూర్చి పెడతారు. నాకు బాగా ఇష్టమైన నిర్మాత అన్నారు.
కథ గురించి చెప్తూ... నా మొదటి సినిమా 'కందిరీగ'లో హీరోకి ఏ బాధ్యతా ఉండదు. అది వెలితిగా ఫీలవుతుంటా. 'రభస'లో హీరో పాత్రకి ఓ ప్రయోజనంతో పాటు బాధ్యతా ఉంటుంది. ఓ కోణంలో ప్లేబాయ్‌లా కనిపించే అతడు మరో కోణంలో రెస్పాన్పిబుల్ పర్సన్‌లా కనిపిస్తాడు. కథకి సరిగ్గా సరిపోతుందనే ఆ టైటిల్ అనుకున్నాం. డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ నెంబర్‌వన్. ఈ సినిమాలో ఆయన చెప్పే డైలాగ్స్ అందర్నీ అలరిస్తాయి అని చెప్పారు.


Click it and Unblock the Notifications












