కరెక్టే...నేను కొన్ని తప్పులు చేశాను: ఇలియానా
సినిమా పరిశ్రమలో గాడ్‌ఫాదర్ లేకపోతే...మంచి కథ, పాత్ర ఎన్నుకోవడం కాస్తంత కష్టం అవుతుంది. సరైన గెడైన్స్ లేకపోవడంవల్ల సినిమాల ఎంపిక పరంగా గతంలో నేను కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులే నాకు మంచి పాఠాలయ్యాయి అంటోంది ఇలియానా. ఆమె సలీం, రెచ్చిపో వంటి డిజాస్టర్ చిత్రాలు రావటానికి కారణం వివరిస్తూ ఇలా చెప్పుకొచ్చింది. అలాగే ఫ్లాపు లు వచ్చినప్పుడు... అంచనాలు తారుమారైనప్పుడు నిబ్బరంగా ఉండాలి. ఎందుకిలా జరిగిందని అదే పనిగా ఆలోచిస్తూ కూచుంటే ముందుకు సాగలేం అంటున్నారు ఇలియానా. అయితే ఇప్పుడు ఒక సినిమాకి సైన్ చేసే ముందు.. కథ మొత్తం వింటున్నాను. ఆ తర్వాత ఆ కథలోంచి నా పాత్రను తీస్తే కథ వెలితిగా అనిపిస్తుందా అని ఆలోచిస్తున్నాను.
ఒకవేళ వెలితిగా అనిపిస్తే.. అప్పుడా సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యం ఉన్నట్లు లెక్క. ఆ తర్వాత వేరే ఆలోచన లేకుండా సినిమాకి సైన్ చేస్తాను. డబ్బే ముఖ్యంగా సినిమాలు ఒప్పుకోను. ఏడాదికి ఒక సినిమా చేసినా మంచి సినిమా చేయాలన్నది నా ఆలోచన. అదే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచాలని తపన మొదలైతే మంచి నటి అనిపించుకోవాలనే లక్ష్యం పక్కదారి పట్టి, ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పేసుకోవాలనిపిస్తుంది అంది ఇలియానా. ఆమె నటించిన నేను నా రాక్షసి, శక్తి చిత్రాలు త్వరలో విడుదలకు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు ఆమె శంకర్ దర్శకత్వంలో త్రీ ఇడియట్స్ తెలుగు, తమిళ వెర్షన్స్ లో నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా, మహేష్ బాబుతో మరో సినిమా, ప్రభాస్‌తో ఓ సినిమా కమిటైంది.


Click it and Unblock the Notifications











