అల్లు అరవింద్ 'గీతా ఆర్ట్స్2' ఆఫీస్‌పై ఐటీ దాడులు.. ఆ చిత్రంపైనే అనుమానం!
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎన్నో చిత్రాలని నిర్మించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బడా నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించిన పలు విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. చిత్ర నిర్మాణంలో అల్లు అరవింద్ వ్యూహాలు ఎక్కువగా ఫలిస్తుంటాయి. ఇటీవల గీత ఆర్ట్స్ 2 పేరుతో మరో సంస్థని ప్రారంభించి అందులో సమర్పకుడిగా చిత్ర నిర్మాణంలో భాగమవుతున్నారు. తాజాగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళదాం..

గీత గోవిందం
గీతా ఆర్ట్స్ స్థాపించిన కొద్ది రోజులకే గీత గోవిందం రూపంలో ఆ బ్యానర్ కి ఘనవిజయం దక్కింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు పరుశురాం తెరకెక్కించారు. గీతా గోవిందం చిత్రం స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధించడం విశేషం. విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన హీరోగా మారిపోయాడు. అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించగా, బన్నీ వాసు నిర్మించారు.

ఐటీ దాడులు
గీతగోవిందం చిత్ర వసూళ్ల లెక్కలు తేల్చేందుకు ఐటీ అధికారులు జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ 2 కార్యాలయంపై దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ చిత్రం 130 కోట్ల వరకు గ్రాస్ సాధించినట్లు సమాచారం ఉండడంతో ఐటి అధికారులు రంగంలోకి దిగారట. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపు పన్ను చెల్లించారా లేదా అనే విషయంలో అధికారులు డాక్యుమెంట్స్ పరిశీలించినట్లు తెలుస్తోంది.

ఇతర చిత్రాలపై కూడా
గత ఏడాది గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వచ్చిన ఇతర చిత్రాల లెక్కలని కూడా ఐటీ శాఖ అధికారులు తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. ఐటీ రైడ్స్ పై గీతా ఆర్ట్స్ సంస్థ ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కానీ చిత్ర వర్గాలు మాత్రం ఈ ఐటీ దాడులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో నిర్వహించేవే అని అంటున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో పేరుగాంచిన నిర్మాణసంస్థల లెక్కలు పరిశీలించడం సాధారణంగా జరిగే పనే అని అంటున్నారు.

సినీ ప్రముఖులపై తరచుగా
ఇటీవల సినీ ప్రముఖపై ఐటీ అధికారులు తరచుగా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో బాహుబలి నిర్మాతలపై కూడా దాడులు జరిగాయి. ఇటీవల ఆదాయపు పన్ను అధికారుల నోటీసుల విషయంలో మహేష్ బాబు కూడా వార్తల్లో నిలిచాడు. తాజాగా అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ సంస్థపై ఐటీ రైడ్స్ జరగడం ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











