అయ్యో.. దెబ్బ తగిలిందా.. నాకు తెలియదు సర్.. నితిన్ గురించి క్యూట్‌గా రష్మిక!
దశాబ్ద కాలం పాటు పరాజయాలు ఎదుర్కొన్న నితిన్ ఇష్క్ చిత్రంతో పుంజుకున్నాడు. ఇష్క్ తరువాత నితిన్ కు గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ అటాక్, అ..ఆ లాంటి విజయాలు దక్కడంతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక నితిన్ కెరీర్ కు తిరుగులేదు అనుకున్న తరుణంలో లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం లాంటి పరాజయాలు పలకరించాయి. దీనితో నితిన్ పునరాలోచనలో పడ్డాడు. సరైన కథ కుదిరితేనే సినిమా ప్రారంభించాలి అని డిసైడ్ అయ్యాడు. ఛలో చిత్రంతో డెబ్యూ దర్శకుడు వెంకీ కుడుముల మంచి కమర్షియల్ హిట్ సొంతం చేసుకున్నాడు. వెంకీ కుడుముల చిత్రానికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

భీష్మగా త్వరలో
నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి భీష్మ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ లోనే ఈ చిత్రం ప్రారంభం కావాల్సి ఉంది. కథ కూడా సిద్ధం అయింది. కానీ అనుకోని కారణాలవలన ఈ చిత్రాన్ని జనవరి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నితిన్ సరసన ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ రష్మిక నటించనుండడంతో ఆసక్తి నెలకొంది.

నితిన్‌కు గాయం
దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రం గురించి స్పందిస్తూ.. భీష్మ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందని అంతా అడుగుతున్నారు. కథ చివరిదశలో ఉంది. నితిన్ అన్న భుజానికి చిన్న గాయమైంది. ఆయన కోలుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే తన లుక్ గురించి కసరత్తు మొదలు పెట్టారు. రష్మిక మేడం షూటింగ్ తో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం అని వెంకీ తెలిపాడు.
నాకు తెలియదు సర్
వెంకీ కుడుముల ట్వీట్ పై రష్మిక స్పందించింది. నితిన్ గురించి చాలా క్యూట్ గా కామెంట్ పెట్టింది. ఈ చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అయ్యో నితిన్ కు గాయమైందా.. నాకు తెలియదు సర్. ఇప్పుడెలా ఉంది.. మీరు త్వరగా కోలుకుంటారని భావిస్తున్నా అంటూ రష్మిక మందన ట్విట్టర్ లో పేర్కొంది. ఛలో చిత్రంలో రష్మిక చేసిన అల్లరికి తెలుగు యువత ఫిదా అయ్యారు. ఆ తర్వాత గీత గోవిందం చిత్రంతో రష్మిక క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఎప్పుడు మొదలు పెడదాం
రష్మిక, వెంకీ కుడుముల ట్వీట్స్ పై నితిన్ కూడా రియాక్ట్ అయ్యాడు. రష్మిక నేనిప్పుడు బాగానే ఉన్నాను. షూటింగ్ లో కలుసుకుందాం. వెంకీ షూటింగ్ ఎప్పుడు మొదలు పెడదాం అని నితిన్ ప్రశ్నించాడు. ఈ చిత్రంలో నితిన్ సరికొత్త గెటప్ లో కనిపిస్తాడట. మరోమారు వెంకీ కుడుముల యువతని ఆకట్టుకునే అంశాలతో కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











