మతిపోగొడుతున్న గుణశేఖర్ ప్లానింగ్.. రానా 'హిరణ్యకశిప'కు 200 కోట్ల బడ్జెట్!
Recommended Video

రుద్రమ దేవి లాంటి చారిత్రాత్మక చిత్రం తరువాత గుణశేఖర్ మరో భారీ ప్రాజెక్ట్ కు సిద్ధం అవుతున్నాడు. దర్శకుడిగా గుణశేఖర్ ప్రతిభ ఏంటో అందరికి తెలిసిందే. ఆరడుగుల అజాన బాహుడు రానా ప్రధాన పాత్రలో గుణశేఖర్ హిరణ్యకశిప చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. పౌరాణిక చిత్రంగా రాబోతున్న హిరణ్యకశిప గురించి చాలా రోజులుగా కసరత్తు జరుగుతోంది. కానీ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందనే క్లారిటీ మాత్రం రావడం లేదు. ఎట్టకేలకు ఈ చిత్రం విషయంలో ముందడుగు పడినట్లు తెలుస్తోంది.

పౌరాణిక చిత్రం
తెలుగులో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలకు అద్భుతమైన ఆదరణ ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈ జోనర్స్ లో వచ్చే చిత్రాలు భారతీయ సంప్రదాయాలకు అద్దం పడుతాయి. ముఖ్యంగా హిందూ పౌరాణికాలపై ఇప్పటివరకు కోకొల్లలుగా చిత్రాలు వచ్చాయి. చాలా కాలం తరువాత దర్శకుడు గుణశేఖర్ ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. హిరణ్యకశిప కథని మరోమారు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.

సరైన హీరో
పౌరాణిక పాత్రలు పోషించాలంటే హీరో ఒడ్డు పొడుగు బావుండాలి. హిరణ్యకశిప పాత్ర కోసం గుణశేఖర్ సరైన హీరోనే ఎంచుకున్నాడు. దగ్గుబాటి రానా ఈ చిత్రంలో నటించబోతున్నాడు. ఇప్పటికే బాహుబలిలో రానా భల్లాల దేవుడిగా భయంకరమైన నటన కనబరిచిన సంగతి తెలిసిందే. హిరణ్యకశిపుడిగా నటించబోతుండడంతో ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ భారీ చిత్రానికి తెరవెనుక కసరత్తు జరుగుతోంది.

200 కోట్ల బడ్జెట్
ఈ చిత్రాన్ని నిర్మాత సురేష్ బాబు 200 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని భాషల్లో విడుదల చేయడానికి సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నారట. దేశ విదేశీ నిపుణులతో ఈ చిత్ర విఎఫ్ఎక్స్ గురించి చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనితో తెలుగు చలన చిత్ర రంగంలో మరో అద్భుత చిత్రానికి భీజం పడిందని చర్చ మొదలయింది.

వేసవి నుంచి
వచ్చే ఏడాది వేసవి నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి సన్నాహకాలు చేస్తున్నారు.జనవరిలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ చిత్రం కోసం నిర్మిస్తున్న భారీ సెట్స్ ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. చాలా లోతుగా చర్చలు జరిపి గుణశేఖర్ ఈ చిత్ర స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











