చిరంజీవి గురించి మీకు తెలియని విషయాలు (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: చిరంజీవిని అభిమానించే అభిమానులకు ఆయన గురించి విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండటం సహజం. తన పుట్టినరోజు సందర్భంగా వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వూలలో చిరంజీవి అనేక విషయాలు చెప్పుకొచ్చారు. ఇందులో ఆయన తన 150వ సినిమా వివరాలతో పాటు ఇతర అంశాలు వెల్లడించారు.
త్వరలో ఆయన 150వ సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకులను అలరింప జేయాలని ఆశ పడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటూ ప్రస్తుతం ఆయన ఎలాంటి రాజకీయ టెన్షన్స్ లేకుండా రిలాక్స్ గా ఉన్నారు. తన బర్త్ ఇంటర్వ్యూలో ఆయన అనేక ఆసక్తికర విషయాలు, ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియని పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
స్లైడ్ షోలో అందుకు సంబంధించిన వివరాలు...

ఇష్టమైన హీరోయిన్
హీరోయిన్ శ్రీదేవి. నా దృష్టిలో పర్‌ఫెక్ట్ హీరోయిన్ అంటే ఆమె. అందంతో పాటుగా వృత్తి పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఇష్టమైన పాట
రుద్రవీణలో పాటలు నాకే కాదు... మా ఆవిడ సురేఖకు కూడా చాలా ఇష్టం. ఆ పాటలు వస్తే ఎవ్వరం ఏం మాట్లాడం. వింటూ ఉండిపోతామని చిరంజీవి తెలిపారు.

అపుడు చేయనివి ఇపుడు
సినిమాలు, రాజకీయాల బిజీలో పడి నేను చేయలేకపోయినవన్నీ ఇప్పుడు చేస్తున్నాను అని చిరంజవి చెప్పుకొచ్చారు.

చేతి రాత బాగుండదట
నా చేతి రాత అస్సలు బావుండదు. ఎంత బావుండదంటే- నేను రాసిన దాన్ని నేనే మళ్లీ చదవలేను. ఇప్పుడు చేతి రాతను మళ్లీ ప్రాక్టీసు చేస్తున్నా.

అబాకస్, సుడోకు
అబాకస్, సుడోకు లాంటి పజిల్ గేమ్స్ నేర్చుకుంటున్నట్లు, వీటి ద్వారా మెదడు చురుకుగా తయారవుతుందని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఫోటో గ్రఫీ హాబీ
నా హాబీ ఫొటోగ్రఫి. నాకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కెమెరాలు కొనుక్కోలేకపోయా. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే అదొక హాబీగా మారిపోయింది.

ఫోటో గ్రఫీ గొప్పదనం
ఒక చిత్రం తీసి దానిని ఇరవై, ముప్ఫై ఏళ్ల తర్వాత మళ్లీ వారికి ఇస్తే కలిగే ఆనందం కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా లభించదని చిరంజీవి అభిప్రాయ పడ్డారు.

50వ సినిమా గురించి...
150వ ఈ సినిమాను నెల లోపులోనే ప్రారంభిస్తాం. ఈ సినిమా సబ్జెక్ట్ అందరినీ అలరించే విధంగా ఉంటుంది. ప్రేక్షకులకు మెసేజ్ ఇచ్చే విధంగా సందేశాత్మక చిత్రం తీస్తే మన ప్రేక్షకులు చూసే పరిస్థితి లేదు. అందుకే శంకర్‌దాదా, రౌడీ అల్లుడు లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్నే చేస్తాను అన్నారు చిరంజీవి.

బడ్జెట్ తక్కువ
ప్రస్తుతం ప్రొడక్షన్ ఖర్చు బాగా పెరిగింది. నిర్మాత బాగు కోసం వాటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. హీరో, హీరోయిన్ల పారితోషికం నుంచి రకరకాల ప్రొడక్షన్ ఖర్చుల దాకా అన్నింటినీ పరిశీలించి తక్కువ బడ్జెట్‌తో 150 సినిమా చేస్తానని చిరంజీవి తెలిపారు.

నచ్చిన దారిలోనే బెరుకు లేకుండా...
ఒక మార్గాన్ని ఎంచుకొని ఎన్ని అవాంతరాలు వచ్చినా బెదరకుండా, ఆ దారిలో వెళ్లటమే నా విజయానికి ప్రధాన కారణమని చిరంజీవి తెలిపారు.

అమ్మ, నాన్న గురించి
నాన్న నాకు హీరో. కానీ అమ్మ దగ్గర చనువెక్కువ. నాకు ఏం కావాలన్నా అమ్మ దగ్గరకు వెళ్లి అడిగేవాడిని. నాన్న అంటే తిడతారనే భయం. కానీ నాన్న తిట్టినప్పుడు కొన్ని లాభాలుండేవి. తిట్టిన ప్రతి సారి- బూట్లు, బట్టలు ఏవో ఒకటి కొనిపెట్టేవారని చిరంజీవితెలిపారు.

ఇల్లే వేరే ప్రపంచం
ఒకప్పుడు సినిమాలు నా వృత్తి. ఇప్పుడు రాజకీయాలు. అంతే. నా వ్యక్తిగత జీవితం వేరు. వృత్తి వేరు. ఒక చొక్కా విప్పి మరో చొక్కా ఎలా వేసుకుంటామో.. ఇంటి గడపలోనే వృత్తికి సంబంధించిన విషయాలన్నీ వదిలేస్తా. ఇల్లు వేరే ప్రపంచం. దానిలో ఒత్తిడికి ప్రవేశంలేదు అన్నారు.


Click it and Unblock the Notifications











