"ఐదు రోజులు నిల్చునే..; వాళ్ల సినిమాల్లో స్టార్ హీరోయిన్లు అలా చేస్తే ఎవరూ అడగలేదు"
'అల్లుడు శీను'తో వెండితెరకు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. స్పీడున్నోడు, జయ జానకి నాయక చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం 'సాక్ష్యం' సినిమాలో నటిస్తున్న సాయి శ్రీనివాస్ నేడు తన 24వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. హీరోగా ఈ సంవత్సరం మంచి హిట్ కొట్టాలన్న ఆకాంక్షతో ఉన్న సాయి శ్రీనివాస్.. పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

సాక్ష్యం సినిమా గురించి:
'సాక్ష్యం' సినిమాలో కథ కొత్తగా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ సినిమా కోసం మంచి ఫైట్స్ అందించారు.
కథ విషయానికొస్తే.. ఇప్పటిదాకా వచ్చిన రివేంజ్ స్టోరీలకు భిన్నంగా.. ఇదో కొత్త ఒరవడికి నాంది పలుకుతుంది. పంచభూతాలను అనుసంధానం చేస్తూ సాగే కథాంశం ఆకట్టుకుంటుంది. చిత్రంలో వీడియో గేమ్ డైరెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాను.

ఐదు రోజులు నిలుచునే సైకిల్..:
'సాక్ష్యం' సినిమాలో కథా పరంగా హీరో అమెరికా నుంచి ఇక్కడికి వస్తాడు. ఈ పాత్ర కోసం బరువు తగ్గాల్సి వచ్చింది. సినిమాలో ఆ కష్టమేంటో కనిపిస్తుంది. బి.ఎమ్.ఎక్స్ సైక్లింగ్ అనే దాన్ని ఈ సినిమాలో పరిచయం చేయబోతున్నాం. నిల్చునే సైకిల్ తొక్కడం దీని ప్రత్యేకత. కష్టమే అయినా.. సినిమా కోసం ఐదు రోజులు నిలుచునే సైకిల్ తొక్కాల్సి వచ్చింది. సినిమాలో ఆ సన్నివేశాలు బాగా వచ్చాయి.

డైరెక్టర్ గురించి..:
తనకంటూ ఓ స్పెషల్ మేకింగ్ స్టైల్ ఉన్న దర్శకుడు శ్రీవాస్. 'లక్ష్యం' సినిమా తర్వాత ఆయనే సొంతంగా కథ రాసుకుని తీస్తున్న చిత్రం ఇది. ఆయనతో పనిచేయడం చాలా బాగుంది. కెరీర్ ఆరంభంలోనే పెద్ద దర్శకులతో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం.

స్టార్ హీరోల సినిమాలపై అడగరు..:
ఈమధ్య చాలామంది మీ ప్రతి సినిమాలోనూ ఓ స్టార్ హీరోయిన్‌తో ఐటమ్ పాట పెడుతున్నారు? అని అడుగుతున్నారు. అందుకే ఈ సారి 'సాక్ష్యం' సినిమాలో అలాంటివేమి పెట్టట్లేదు. బాలీవుడ్‌లోనూ, మన స్టార్ హీరోల సినిమాల్లోనూ స్టార్ హీరోయిన్స్ ఆడి పాడితే ఎవరూ పెద్దగా మాట్లాడలేదు .కానీ ఎందుకనో నా సినిమా విషయంలోనే చర్చ జరుగుతోంది.

యాక్షన్ ఇమేజ్..:
చాలామంది మాస్ ఇమేజ్ కోసమే కష్టపడుతారు. అలాంటి ఇమేజ్ నాకు ముందే రావడం నా అదృష్టం. ఫలానా తరహా కథనే చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. లవ్ స్టోరీ అయినా.. యాక్షన్ అయినా కొత్తగా ఉంటేనే సినిమా కమిట్ అవుతాను. యాక్షన్ లేనంత మాత్రాన, లవ్ స్టోరీ కానంత మాత్రానా సినిమా రిజెక్ట్ చేయను.


Click it and Unblock the Notifications











