'ఇంటింటా అన్నమయ్య' షూటింగ్ ప్రారంభం
హైదరాబాద్: 'శ్రీరామరాజ్యం' తర్వాత సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబా నిర్మిస్తున్న చిత్రం 'ఇంటింటా అన్నమయ్య'. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తున్నారు. రేవంత్ హీరోగా పరిచయమవుతున్నాడు. అనన్య, సనంశెట్టి ఇందులో హీరోయిన్లు. విజయదశమి రోజున ఈ చిత్రం ప్రారంభ వేడుక హైదరాబాదులో జరిగింది.
దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి రమేష్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. అక్కినేని నాగేశ్వర రావు క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత యలమంచిలి సాయిబాబా మీడియాతో మాట్లాడారు. భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని తెలిపే అద్భుతమైన కథ ఇది అని ఆయన అన్నారు.
'ఓ కొత్త పంథాలో రూపొందే ఈ సినిమాలో యువతరం మెచ్చే ప్రేమ కథ కూడా ఉంటుంది. అన్నమయ్య కీర్తనల నేపథ్యంలో సంగీత ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని కీర్తనలు హిందుస్థానీ కలయికతో ఉంటాయి. కీరవాణి సంగీతం ఈ సినిమాకే మెయిన్ హైలెట్. నవంబర్ 1 నుంచి అరకులోయలో తొలి షెడ్యూల్ చిత్రీకరిస్తాం' అని సాయిబాబా వివరించారు.
బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, జయప్రకాష్ రెడ్డి, సుధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా గోపాల్ రెడ్డి. సంగీత ప్రధానమైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications












