అరకులోయలో రాఘవేంద్రుని కొత్త చిత్రం ప్రారంభం
భారతీయ సంస్కృతి, గొప్పతనాన్ని తెలియజేసే కథాంశంతో దర్శకేంద్రుడు రూపొందిస్తున్న 'ఇంటింటా అన్నమయ్య' చిత్రంలో గాజువాకకు చెందిన 50 మంది చిన్నారులకు నటించే అవకాశం లభించింది.
నవంబరు 1 నుంచి 20 వరకు అరుకులోయలో తొలి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. అకాడమీకి చెందిన 25 మంది చిన్నారి నృత్య కళాకారిణులు, మరో 20 మంది బాలగాయకులు పాల్గొంటారు. ఇందుకోసం 6 నుంచి 11 ఏళ్లలోపుచిన్నారులను ఎంపిక చేశారు. నాలుగురోజులపాటు షూటింగ్ జరుగుతుంది.
'శ్రీరామరాజ్యం' చిత్రంతో తన బేనరు ప్రతిష్టను పెంచుకున్న సాయిబాబా మూవీస్ అధినేత యలమంచిలి సాయిబాబా నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఇంటింటా అన్నమయ్య'. సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకునే ఈ చిత్రంలో సాయిబాబా తనయుడు రేవంత్ హీరోగా పరిచయమవుతున్నారు. అనన్య, సనంశెట్టి కథానాయికలు. ఈ చిత్రం షూటింగ్ విజయదశమి సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
నిర్మాత యలమంచిలి సాయిబాబా మాట్లాడుతూ 'భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని తెలిపే అద్భుతమైన కథ ఇది. ఓ కొత్త పంథాలో రూపొందే ఈ సినిమాలో యువతరం మెచ్చే ప్రేమకథ కూడా ఉంటుంది. అన్నమయ్య కీర్తనల నేపథ్యంలో సంగీత ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని కీర్తనలు హిందూస్థానీ కలయికలో ఉంటాయి.
ఐదు పాటల రికార్డింగ్ పూర్తయింది. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. నవంబర్ ఒకటి నుంచి ఇరవై వరకూ అరకు లోయలో తొలి షెడ్యూల్ జరుగుతుంది. రెండో షెడ్యూల్ డిసెంబర్ ఒకటి నుంచి హైదరాబాద్‌లో ఉంటుంది' అని తెలిపారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, జయప్రకాశ్‌రెడ్డి, సుధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: ఎస్.గోపాలరెడ్డి, సంగీతం: కీరవాణి, నిర్మాత: యలమంచిలి సాయిబాబా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు.


Click it and Unblock the Notifications












