స్పాట్‌ఫిక్సింగ్ కేసులో బాలీవుడ్ లో ఒకరు అరెస్ట్
ముంబయి : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌తో బాలీవుడ్‌కు ఉన్న సంబంధాలు పూర్తిగా బయిటపడుతున్నాయి. దివంగత నటుడు ధారాసింగ్ కుమారుడు విందూ రణధవా ధారాసింగ్‌ను ముంబయి క్రైంబ్రాంచ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బుకీలతో విందూకు సంబంధాలున్నాయనే ఆధారాలు క్రైం బ్రాంచ్ పోలీసులకు లభించినట్లు తెలిసింది.
రమేశ్ వ్యాసా అనే బుకీతో ఆయన వ్యాపార లావాదేవీలు నెరపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. న్యాయమూర్తి విందూను ఈ నెల 24 వరకూ పోలీసు కస్టడీకి అప్పగించారు. 49 ఏళ్ల విందూ 'సన్ ఆఫ్ సర్దార్', 'జోకర్, కంబక్త్ ఇష్క్' తదితర హిందీ చిత్రాల్లో నటించాడు. 2009లో 'బిగ్ బాస్ సీజన్ 3 రియాల్టీ షో'లో విజేతగా నిలిచాడు.

మరోప్రక్క ఈ కేసులో ఒక తెలుగు సినీ నిర్మాతకు సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నప్పటికీ స్థానిక పోలీసులకు దీనిపై ఎలాంటి సమాచారం లేదు. ఫిక్సింగ్ కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఢిల్లీ, ముంబయి పోలీసులు కూడా తమను ఏమీ అడగలేదని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. అనధికారికంగా వివరాలను ఆరా తీస్తున్నామని ఆయన తెలిపారు.
ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో తెలుగు నిర్మాత ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావిస్తే భరద్వాజ మాట్లాడుతూ ''అసలు ఆ కుంభకోణంలో ఎవరున్నారో స్పష్టత లేదు. కేవలం తెలుగు నిర్మాత అని పుకార్లు మాత్రం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది ఫైనాన్సియర్‌లు నిర్మాతలుగా చలామణి అవుతున్నారు. ఆ నేరం నిరూపణ అయ్యాక ఆయనెవరో, నిజంగా నిర్మాత అవునో కాదో తెలుసుకుని మండలిలో చర్చించి చర్యలు తీసుకుంటాము''అన్నారు.


Click it and Unblock the Notifications











