IPL ప్రభావం : వాయిదా పడ్డ తెలుగు సినిమాలు
హైదరాబాద్ : ఐపియల్ ఎఫెక్ట్ తెలుగు సినిమాలపై ఈ సారి బాగా పడింది. ఈ వేసవిలోనే రామ్‌చరణ్ నటించిన 'జంజీర్' అనువాదంగానీ, 'ఎవడు'గానీ వస్తాయనుకొన్నారు. అయితే రెండింటిలో ఏదీ ఈ వేసవిలో రావడం లేదు. దాంతో ఆ సినిమాలతో ఒడ్డున పడదామనుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కి నిరుత్సాహం కలుగుతోంది.
ఈ క్రికెట్ ఫీవర్ తో పెద్ద హీరోల చిత్రాల విడుదల తేదీలు మారుతూ వచ్చాయి. ఈ తారుమార్ల వల్ల చిన్న చిత్రాలు ముందుకీ వెనక్కీ వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఈ నెలలో విడుదల కావల్సిన పలు చిన్న చిత్రాలు జూన్‌కి వెళ్లిపోయాయి. ఇందులో 'ప్రేమకథాచిత్రమ్', 'ప్రేమ ఒక మైకం' లాంటివి ఉన్నాయి. నరేష్ నటించిన 'యాక్షన్ 3డీ'ని ఈ నెలాఖరున తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఐపిఎల్ ప్రబావంతో వచ్చే శుక్రవారం బాక్సాఫీసు దగ్గర కళ తక్కువగానే ఉండబోతోంది. దాంతో ఎప్పట్నించో వాయిదాపడుతూ వస్తున్న 'రామాచారి'తోపాటు అనువాద చిత్రాలు 'మిడత', 'రాజకోట రహస్యం', కొత్తవాళ్లు నటించిన 'లవ్‌టచ్' విడుదలవుతున్నాయి. ఒక వారం ఆడిన తరవాత పెద్ద చిత్రాల కోసం తీసేసే పరిస్థితి కంటే ఎక్కువ రోజులు నిలబెట్టుకొనే వీలున్నప్పుడే రావాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
సుధీర్ బాబు హీరోగా రూపొందిన 'ప్రేమకథాచిత్రమ్' వాయిదా పడింది. ఈవిషయమై మారుతి మాట్లాడుతూ ''సినిమాల మీద ఐపీఎల్ తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఈ వేడి ఫైనల్స్‌కి చేరేసరికి మరింత ఎక్కువ అవుతుంది. అలాగే పెద్ద చిత్రాలూ రాబోతున్నాయి. వాటి నడుమ మా చిత్రాన్ని విడుదల చేయడం ఎందుకనే ఉద్దేశంతోనే జూన్‌కి వెళ్లిపోయాము''అన్నారు.


Click it and Unblock the Notifications











