ఇలా తిరిగి రానిలోకాలకు వెళ్లడం భావ్యమా?.. చిరంజీవి, కమల్, వెంకటేష్, ప్రకాశ్‌రాజ్ భావోద్వేగం
ఎన్నో విలక్షణ, విభిన్నమైన పాత్రలతో ఆలరించిన నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించిన వార్త సినీ ప్రేక్షకులను కుదిపేసింది. బాలీవుడ్ ప్రముఖులను ఈ వార్త జీర్ణించుకోలేని పరిస్థితిని తెచ్చింది. ఇర్ఫాన్ ఆకస్మిక మృతిపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ సహచర నటుడు ఇర్ఫాన్ ఇకలేరన్న వార్తతో తెలుసుకొని మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటులు కమల్, ప్రకాశ్ రాజ్, విక్టరీ వెంకటేష్ తదితరులు సోషల్ మీడియాలో స్పందించారు. వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ..

ఒక్కసారిగా కుదిపేసింది..
ఇర్ఫాన్ ఖాన్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారనే వార్త నన్ను ఒక్కసారిగా కుదిపేసింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అద్భుతమైన నటుడి మరణం నన్ను తీవ్రంగా బాధిస్తున్నది. నటుడిగా ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నటనా ప్రతిభతో మన గుండెల్లో చెరిపివేయలేని ముద్ర వేసుకొన్నారు. ప్రియమైన ఇర్ఫాన్.. నీవు ఇకలేవన్న వార్త మమల్ని విషాదంలోకి నెట్టింది. ఇప్పటికీ మీరు మా హృదయాల్లో చిరకాలం ఉంటారు అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు
ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందారనే వార్త అత్యంత విషాదకరం. ఇంత చిన్న వయసులోనే తిరిగి రానిలోకాలకు వెళ్లడం భావ్యమా? ప్రపంచ సినిమాకు నీవు చేసిన విలువైన సేవలకు జీవితాంతం రుణపడి ఉంటాం. నీవు లేని లోటు పూడ్చలేనిది. నీవు ఏ లోకాలో ఉన్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంత త్వరగా
ఇంత త్వరగా నీవు ఈ లోకాన్ని వీడుతావని కలలో కూడా ఊహించలేదు. నిన్ను తెరమీద చూసిన ప్రతీసారి వావ్ అనిపించావు. దేశంలోనే అత్యుత్తమ ప్రతిభావంతుడైన నటుడివి నీవు. నీ ప్రయానం, కీర్తి మరింత కాలం కొనసాగాలని ఆశించాను. కళామతల్లికి ఇంకా ఎంతో సేవ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇలా అర్ధాంతరంగా వదలివెళ్లడం బాధగా ఉంది. ఈ విషాద సమయంలో నీ కుటుంబానికి మానసిక స్థైర్యం ఇవ్వాలని కోరుకొంటున్నాను అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.
ప్రపంచ సినిమాకు తీరని
ప్రపంచ సినిమాకు తీరని, పూడ్చలేని లోటు. ఆయనతో కలిసి నటించాలనే కోరిక తీరలేదు. కానీ ఆయన నటనను చూసి స్ఫూర్తిని పొందాను. పుష్కలమైన ప్రతిభ ఉన్న నటులు ఇర్ఫాన్ అని చెప్పగలను. మీ సేవలను, మీ సినిమాలను, నటనను చిరకాలం మా హృదయంలో దాచుకొంటాం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని వెంకటేష్ ట్వీట్ చేశారు.
Recommended Video

నట కిరీటాన్ని కోల్పోయాం
ఇర్ఫాన్ ఖాన్ మృతితో ప్రపంచ సినిమా నట కిరిటాన్ని కోల్పోయింది. సినిమా పరిశ్రమలో విభిన్నమైన నటుల్లో ఒకరు. అలాంటి లెజెండ్ ఆకస్మిక మనకు దూరమయ్యారు. ఇర్ఫాన్ జీ.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని రాంచరణ్ ట్వీట్‌లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











