ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత? త్వరలోనే అధికారిక ప్రకటన
తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్దికి ప్రోత్సాహాన్ని అందిస్తూ, చొరవ చూపుతున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నది. ఈ మేరకు సినిమా పరిశ్రమకు సంబంధమున్న అన్ని శాఖల్లోను ప్రక్షాళన చేపట్టేందుకు సిద్దమవుతున్నది. అలాగే ఏపీ సినిమాటోగ్రఫి మంత్రిత్వ శాఖ పరిధిలోని, అలాగే చలన చిత్ర పరిశ్రమాభివృద్ది విభాగంలో ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే అంశంపై దృష్టి సారించినట్టు సమాచారం. ఈ మేరకు పలు నామినేటెడ్ పోస్టుల కోసం సరైన అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను పార్టీ వర్గాలకు, అధికారులకు అప్పజెప్పినట్టు తెలుస్తున్నది. ఈ పోస్టుల భర్తీ వెనుక ఉన్న వివరాల్లోకి వెళితే..
గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమను అత్యంత వివాదాస్పదమైన అంశం కుదిపేసింది. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌ను అడ్డుకొనేందుకు సినిమా థియేటర్లను మూసివేస్తున్నట్టు డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ప్రకటించిన అంశం తీవ్ర వివాదానికి గురి చేసింది. ఈ విషయం తెలుగు సినిమా పరిశ్రమలో అనేక ప్రకంపనలు గురి చేసింది.

అయితే ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమలో చోటు చేసుకొనే అంశాలు, సమస్యలు, వాటికి పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తున్నది. థియేటర్ల బంద్ వ్యవహారాన్ని చాకచక్యంగా పరిష్కరించింది. అలాగే ఈ విషయంలో నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల మధ్య ఉన్న అపోహాలను, అనుమానాలను నివృత్తి చేసింది. ఇక సినిమా పరిశ్రమకు ప్రభుత్వానికి వారధిగా ఉండే పోస్టుల భర్తీపై కసరత్తు మొదలుపెట్టింది.
అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సినిమా పరిశ్రమ నుంచి నిర్మాతలు, దర్శకులు, హీరోలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలువకపోవడం వివాదంగా మారింది. అయితే అభివృద్ధికి తాము సహకారం అందిస్తామని చెప్పినా వారు ముఖం చాటేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున ఇండస్ట్రీ సమస్య తీర్చే ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేసే ఆలోచనలో ఉన్నట్టు ఓ వార్త ప్రచారం అవుతున్నది.
ఇదిలా ఉండగా, సినిమా పరిశ్రమ నుంచి కొందరి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. వారిలో నుంచి సీనియర్ నిర్మాత ఏఎం రత్నంను ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమించాలనే ప్రతిపాదన పరిశీలనలోకి వచ్చింది. ఆయన అభ్యర్థిత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఆయనను నియమించాలనే విషయంపై సానుకూలత ఏర్పడింది. దాంతో ఆయనను ఆ పదవికి ఎంపిక చేస్తూ త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది అని ఓ వార్త మీడియాలో ప్రచారం అవుతున్నది.
అయితే ఏఎం రత్నం విషయానికి వస్తే.. సినిమా పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలు, అగ్ర హీరోలతో పలు చిత్రాలు నిర్మించారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్‌తో హరిహర వీరమల్లు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీసీ చైర్మన్ పదవికి ఆయన పేరు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. సౌమ్యుడు, వివాదారహితుడైన ఆయన అన్ని విధాల ఆయన ఈ పోస్టుకు అర్హుడు అనే మాట కూడా సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











