వైసీపీలోకి వీవీ వినాయక్?.. చెక్ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి!
ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏప్రిల్‌లో జరుగుతాయని భావిస్తున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఒక పార్టీలో నుంచి జంపింగ్ జపాంగ్స్ భారీగానే కనిపిస్తున్నారు. అలాగే రాజకీయాలపై ఆసక్తిని ప్రదర్శిస్తున్న ఔత్సాహికులు, ప్రముఖులు తమకు అనుకూలంగా ఉన్న పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన ఇటీవల తన మనసు మార్చుకొన్నారనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం భారీ కసరత్తు జరుగుతున్నది. ఈ సారి రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేయాలని భావించారు. ఆ క్రమంలో పార్టీ నేతలతో కొద్దికాలంగా సంప్రదింపులు జరుపుతున్నారు. వైసీపీ నుంచి కూడా ఆయనకు హామీ లభించడంతో వినాయక్ కూడా సానుకూలంగా స్పందించారు అని తెలిసింది.

అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి ఎంపీగా పోటీ చేయాలనే ఆశలపై మెగాస్టార్ చిరంజీవి నీళ్లు చల్లారనేది తాజా వార్త ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతున్నది. అయితే రాజకీయాల్లోకి రాకుండా, వైసీపీలో చేర వద్దని చిరంజీవి సలహా ఇచ్చారు. దాంతో తన అభిమాన నటుడు ఇచ్చిన సలహాతో తన నిర్ణయాన్ని మార్చుకొన్నారని తెలిసింది.
అయితే రాజమండ్రి బరి నుంచి వీవీ వినాయక్ పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడంతో వైసీపీ అధిష్ఠానం మరో అభ్యర్థిని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఈ స్థానంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను రాజమండ్రి వైకాపా ఎంపీగా పోటీ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి గణేష్‌ను దించాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవికి వీవీ వినాయక్ వీరాభిమాని. ఆయనను స్పూర్తిగా తీసుకొని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. చిరంజీవితో టాగూర్, ఖైదీ నంబర్ 150 చిత్రాలు చేశారు. అలాగే రాంచరణ్‌తో నాయక్ అనే సినిమాకు వినాయక్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
వినాయక్‌కు సంబంధించిన ఈ విషయాన్ని పక్కన పెడితే.. మెగాస్టార్ చిరంజీవి ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైజాగ్ చేరుకొన్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో అభిమానులు భారీ స్వాగతం పలికారు. లోక్ నాయక్ ఫౌండేషన్ పర్యవేక్షణలో జనవరి 20వ తేదీన ఎన్టీఆర్ 28 వర్ధంతి కార్యక్రమంలో హాజరయ్యేందుకు వైజాగ్‌కు చేరుకొన్నారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నిర్వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











