సినీ నటి రోజాకు గడ్డు పరిస్థితి.. ఆ ముగ్గురే కారణమా?
నోరు మంచిదైతే ఊరు మంచిదే అనే సామెత నూటికి నూరుపాళ్లు రాజకీయాలకు కచ్చితంగా సరిపోతుంది. ఎందుకైతే బాధ్యాతయుతమైన ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు నాలికను ఎప్పటికప్పుడు మడతేసి.. ఇబ్బందిలో పడే పరిస్థితి రాకూడదు. అయితే మంత్రి పదవిలో కొనసాగుతున్న సమయంలో సినీ నటి రోజా సెల్వమణి జబర్దస్త్‌గా చేసిన వివాదాస్పద కామెంట్స్ ప్రస్తుతం ఆమెకు గడ్డు పరిస్థితి తెచ్చిపెట్టాయనే టాక్ మీడియాలోను, సోషల్ మీడియాలో వాదన బలంగా వినిపిస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
సినీ నటి రోజాకు మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి లాంటి అగ్రహీరోతో కలిసి నటించింది. ఆమె మంత్రి పదవి చేపట్టిన తర్వాత స్వయంగా ఆయన పిలిచి తన నివాసంలో కుటుంబ సభ్యులందరికీ సన్మానం చేసి పంపించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గురించి అవాకులు, చెవాకులు పేలారు. అయితే ఓ సందర్బంలో చిరంజీవి స్పందిస్తూ.. రోజా గురించి ఎంత తక్కువ మాట్లాడితే.. అంత మంచిదని చెప్పడం అసహనం వ్యక్తం చేశారు.

ఇక ఇండియాలో సూపర్ స్టార్లలో ఒకరు రజనీకాంత్. చంద్రబాబును పొగిడారనే కారణంతో ఆయనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై సినీ వర్గాలే కాకుండా, రాజకీయ వర్గాలు కూడా తప్పు పట్టాయి. పాండిచ్చేరిలోని ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఆమె.. రజనీకాంత్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ సినిమాలకు కాలం చెల్లింది.. అతడు ఒకప్పటి సూపర్ స్టార్ మాత్రమే. ఇప్పుడు ఆయన సినిమాలే నడవడం లేదని నోరు పారేసుకొన్నారు.
ఇక పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి.. ఆయనపై విమర్శలు చేయడం పర్వాలేదు. కానీ రాజకీయంగా విబేధించాలే కాని.. వ్యక్తిగత దూషణలకు పాల్పడటం వివాదంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు. ప్రతీపక్షంలో ఉన్న మాదిరిగానే ఆరోపణలు చేస్తే.. పదవికి ఉండే హుందా తనం తగ్గిపోతుంది అనే వాదన రోజా గురించి వినిపిస్తున్నది.

ప్రస్తుతం నగరి నుంచి పోటీ చేస్తున్న మంత్రి రోజాకు అక్కడ గడ్డు పరిస్థితులు ఉన్నాయనే వార్త బలంగా వినిపిస్తున్నది. నగరిలో తమిళ ప్రభావం ఎక్కువ. అక్కడ రజనీకాంత్‌కు విశేషంగా అభిమానులు ఉన్నారు. ఈ సారి రజనీకాంత్, తమిళ అభిమానులు ఆమెకు వ్యతిరేకంగా మారారు అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అంతేకాకుండా మెగా, పవర్ స్టార్ అభిమానుల కూడా ఆమెపై గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది.
ఇలాంటి సినీ అభిమానుల ప్రభావం.. అలాగే అక్కడ బలంగా ఉన్న తెలుగుదేశం అభిమానులు, కార్తకర్తలు, సానుభూతి పరులు రోజాకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకొన్నారనే విషయాన్ని తాజా సర్వేలు బలంగా చెబుతున్నాయి. ఈ ముగ్గురు హీరోల వ్యతిరేక ఓటు, ప్రభుత్వంపై అసమ్మతి ఓటు ఆమెను ఓడిస్తాయా? తాజా సర్వే రిపోర్టులను ఆమె అధిగమిస్తుందా అనే వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











