ప్రజారాజ్యం అట్టర్‌ఫ్లాప్ నుంచి జనసేన బ్లాక్‌బస్టర్ వరకు.. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా పవన్ వ్యూహం ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నూతన ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ క్షణం కోసం లక్షలాది మంది అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి ఇది పండుగ రోజు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు తమ వర్గానికి చెందిన నేత సీఎం అవుతారని వారు దశాబ్ధాలుగా నిరీక్షించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈ కమ్యూనిటీ అంతా ఏకమై ఆయనకు అండగా నిలిచినా అప్పటి రాష్ట్ర పరిస్థితుల్లో పీఆర్పీకి నిరాశజనక ఫలితాలే వచ్చాయి.
పవన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రజారాజ్యం పార్టీని మెగా, పవన్ అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. 2008 ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి దూకారు. తనను ఇంతటివాడిని చేసిన ప్రజలకు ఏదైనా చేయాలనే లక్ష్యంతో ముందుకు కదిలారు. రాజకీయ దిగ్గజాలు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలతో తలపడటం ఆషామాషీ వ్యవహారం కాదని తెలిసినా చిరంజీవి రిస్క్ చేశారు. ఆ పార్టీ యువరాజ్యం విభాగానికి అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీఆర్పీ అభ్యర్ధుల తరపున ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. తన ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఉర్రూతలూగించారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలను పంచెలూడదీసి పరిగెత్తించి కొట్టాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

కానీ ఆ ఎన్నికల్లో పీఆర్పీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కేవలం 18 స్థానాల్లోనే విజయం సాధించిన చిరు.. తర్వాత పార్టీని నడపటం సులువు కాదని గ్రహించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అందుకు ప్రతిఫలంగా రాష్ట్ర కేబినెట్‌లో బెర్త్‌లతో పాటు తను రాజ్యసభకు ఎన్నికై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇది పవన్ మనసులో బలంగా నాటుకుపోయింది. విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పవన్.. అన్నయ్య నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేశారు.
ప్రజారాజ్యం విలీనం తర్వాత రెండేళ్ల పాటు చిరంజీవితో పవన్ మాట్లాడలేదని ఇండస్ట్రీ టాక్. అయినప్పటికీ ఆయన మనసు మాత్రం సమాజం, ప్రజలు వీటి చుట్టూనే తిరిగింది. ఇలాంటి సమయంలో కేంద్రంలోని యూపీఏ సర్కార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని పవన్ వ్యతిరేకించారు. సమైక్యాంధ్రకు గట్టి మద్ధతుదారుడైన ఆయన రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత జనసేన పార్టీని స్థాపించారు.

2014లో ఎన్నికలకు పెద్ద సమయం లేకపోవడం.. అప్పటి రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా అపార అనుభవం , పాలనా దక్షత ఉన్న చంద్రబాబు సీఎం కావాలనే ఉద్దేశంతో టీడీపీ - బీజేపీలకు మద్ధతు తెలిపి కూటమి అభ్యర్ధుల తరపున ప్రచారం చేశారు. ఎన్నికల తర్వాత పవన్ సినిమాల్లో బిజీ కావడంతో ఆయనపై వైసీపీ నుంచి ఎన్నో విమర్శలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ పవర్‌స్టార్ కాదు.. ప్యాకేజ్ స్టార్ అని, ఇది ప్రజారాజ్యం-2 అని, చిరంజీవి పార్టీ పోస్ట్ పెయిడ్ అయితే, తమ్ముడి పార్టీ ప్రీ పెయిడ్ అంటూ కామెంట్లు చేశారు.
టీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ.. అయినప్పటికీ ఉద్ధానం కిడ్నీ బాధితుల తరపున , రాజధాని రైతుల తరపున పవన్ కళ్యాణ్ పోరాడారు. కానీ 2018 మార్చిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో చంద్రబాబుకు, టీడీపీకి, బీజేపీకి వ్యతిరేకంగా ఆయన ప్రసంగించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రత్యేక హోదా అడిగితే ప్యాకేజీ పేరిట పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ తీవ్రంగా విమర్శించారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని.. తాను ఎంపీల మద్ధతును కూడగడతానని పవన్ ముందుకొచ్చారంటే ఆయనలోని ఫైర్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

టీడీపీ , బీజేపీ కూటమిలోంచి బయటకు వచ్చి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుని పవన్ ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే పవన్ ఒంటరిగా పోటీ చేస్తున్నారని వైసీపీ ప్రచారం చేసింది. కానీ ఆ ఎన్నికల్లో జనసేనకు చేదు ఫలితాలొచ్చాయి. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోగా.. కేవలం ఒకే ఒక్క చోట గెలుపొందినా ఆ ఎమ్మెల్యే తర్వాత జై జగన్ అనేశాడు. అయినప్పటికీ కృంగిపోకుండా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేసి తన సొంత డబ్బును కౌలు రైతులను ఆదుకునేందుకు ఇచ్చారు. పార్టీని నడిపేందుకు సినిమాలు చేశారు. వాటి విడుదలకు సైతం జగన్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. అయినప్పటికీ తట్టుకుని నిలబడ్డారు పవన్ కళ్యాణ్. ఆయన చేసిన పోరాటాలు జనంలోకి విస్తృతంగా వెళ్లాయి.
2019 నాటి తప్పులు చేయకుండా టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టకున్నారు. చంద్రబాబు వ్యూహాలు, మోడీ ఛరిష్మా, తన సమ్మోహన శక్తితో కూటమి అపూర్వ విజయం సాధించడంలో తిరుగులేని పాత్ర పోషించారు. అంతేకాకుండా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సీట్లను ఏపీ నుంచి అందించేంతగా ప్రభావితం చేసేలా రాజకీయ వ్యూహాలను రచించడమే కాకుండా సఫలమయ్యారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మంత్రి పదవితో పాలనకు సిద్దమయ్యారు.


Click it and Unblock the Notifications











