నిజంగానే మెంటల్ అని...హీరోగారికి తెలిసొచ్చింది!
ముంబై : మెగాస్టార్ చిరంజీవి నటించిన 'స్టాలిన్' చిత్రానికి రీమేక్‌గా సల్మాన్ హీరోగా బాలీవుడ్‌లో 'మెంటల్' అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ ప్రొడ్యూస్ చేయడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు.
మొదట్లో 'మెంటల్' టైటిల్ బాగానే ఉందని అంతా భావించారు. వెరైటీగా, క్యారీగా ఉంటుందనే ఫిక్స్ చేసారు. అయితే రాను రాను ఈ టైటిల్‌పై హీరో సల్మాన్‌కు అయిష్టత పెరిగిపోతోందట. సినిమా విడుదలయ్యాక ఏమైనా తేడా వస్తే అంతా తనను మెంటల్ హీరో అని హేళన చేస్తారని భయం ఆయన్ను వెంటాడుతోందట. అందుకే 'మెంటల్' టైటిల్‌ను పున:సమీక్షించడంతో పాటు, ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారట. మరి ఏం టైటిల్ ఖరారు చేస్తారో చూడాలి.
ఈచిత్రంలో హీరోయిన్లుగా సనాఖాన్, డైసీ షా ఎంపికయ్యారు. ఈ చిత్రంలో హీరోయిన్ల పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఈ నేపథ్యంలో అగ్రస్థాయి హీరోయిన్లు కాక పోయినప్పటికీ ఈ ఇద్దరినీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 'మెంటల్' చిత్రాన్ని ఈ సంవత్సరం రాబోయే ఈద్ పండుగకు విడుదల చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నట్లు బాలీవుడ్ సమాచారం. ఈ పండుగ సందర్భంగా విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రాలు బాక్సాఫీసును బద్ధలుకొట్టాయి.
ఈద్ పండుగకు వచ్చిన చిత్రాల్లో 2009వ సంవత్సరంలో వచ్చిన 'వాంటెడ్', 2010లో విడుదలైన దబంగ్, 2011లో బాడీగార్డ్‌తో పాటు ఈ సంవత్సరం ప్రేక్షకులను అలరించిన 'ఏక్ థా టైగర్'లు భారీ విజయం సాధించాయి. అందుకే ఈ సారి ఈద్‌కు 'మెంటల్' చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు.
సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చే చిత్రం కావడంతో తనకు మంచి పేరు వస్తుందని సల్మాన్ భావిస్తున్నారట. ఇప్పటికే బీయింగ్ హ్యూమన్ సంస్ధ ద్వారా పలు రకాల సామాజిక కార్యక్రమాలను చేపడుతున్న సల్మాన్ ఈ సినిమా తర్వాత మరింత గొప్పపేరు తెచ్చుకోవడం ఖాయం అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











