వైఎస్ జగన్ అరాచకాల వల్లే రామోజీ మరణం.. వైసీపీ పతనంతో మనశ్శాంతిగా.. సినీ నిర్మాత సంచలన వ్యాఖ్యలు
ఈనాడు పత్రికాధినేత, ప్రముఖ నిర్మాత రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలకు, మీడియాకు చేసిన ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మరణానికి పరోక్షంగా వైఎస్ జగన్ అంటూ ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. నట్టి కుమార్ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
రామోజీరావు ఎన్నో కోట్ల మందికి ఆయన ఆదర్శప్రాయులు, ఎంతో మందికి స్ఫూర్తిప్రదాత. రామోజీ ఫిలింసిటీని నిర్మించి, చిన్న సినిమాలు కూడా షూటింగ్ చేసుకునేందుకు ఎంతగానో సహకరించారు. నేను నిర్మాతగా తొలినాళ్ళలో బండ్ల గణేష్ హీరోగా తీసిన సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో చేయడానికి కారణం చిన్న సినిమాల పట్ల ఆయనకు ఉన్న ఆదరణ, పెద్ద మనస్సే. చిన్న సినిమాలు సైతం ఫిలింసిటీలో షూటింగ్ చేసుకోవచ్చని చాటి చెప్పారు అని నట్టి కుమార్ అన్నారు.

నేను ఫిలింఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఉన్నప్పుడు ఆయన అమూల్యమైన సూచనలు, సలహాలను ఇచ్చి మార్గదర్శకులుగా నిలిచారు. కొత్త వాళ్ళతో అయినా సినిమాలు తీసి, ఎంత పెద్ద హిట్ చేయొచ్చో నిరూపించారు అని తనతో ఉన్న అనుబంధాన్ని నట్టికుమార్ షేర్ చేసుకొన్నారు.
రామోజీ నిరాడంబర జీవితం గురించి వివరిస్తూ.. 2008లో ఒకసారి ఫ్లైట్‌లో చెన్నైకి వెళుతున్నాను. అదే విమానంలో వారి పక్కన కలసి ప్రయాణించే అదృష్టం, అనుబంధం నాకు కలిగింది. ఆ సందర్భంగా వద్దు అని వారించి మరీ వారి లగేజీని వారే మోసుకుని వెళ్లడం ఆయన నిరాడంబరతకు ఒక నిదర్శనం అని అన్నారు.

దర్శక, నిర్మాతలుగా దాసరి నారాయణరావు గారు, ఆయన సమకాలీకులు. కొత్త వాళ్ళను, చిన్న సినిమాలను పోటాపోటీగా తీసి, చిత్రసీమలో ఆరోగ్యకరమైన మంచి సినిమాల సృష్టికర్తలుగా నిలిచిపోయారు. నిజాయితీగా వార్తలను ఉన్నది ఉన్నట్లుగా ప్రెజంట్ చేశారు. ఉదయం ఐదు గంటలకే ప్రపంచం నలు చెరగులా దిన పత్రికను అందిచడంతోపాటు ఈటీవీని సైతం ప్రజల చెంతకు చేర్చి, చైతన్యాన్ని నింపారు అని నట్టికుమార్ అభిప్రాయపడ్డారు.
అయితే మీడియాలో అత్యున్నత స్థాయికి ఎదిగిన రామోజీరావు మరణానికి వైఎస్ జగన్ ప్రభుత్వమే కారణం. ఇంకా ఆయన ఎంతో కాలం మన మధ్యే ఉండేవారే. కానీ ఆంధ్రప్రదేశ్‌లో 5 ఏళ్ల పాలనలో ఆయనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, ప్రతీకార చర్యలతో మనోవేదనకు గురయ్యారు. అందువల్లే రామోజీ ఆరోగ్యం దెబ్బతిన్నది. ఏపీలో ఎన్నికల ఫలితాలు రాగానే అరాచకపాలన అంతమొందిన్న వార్తలను చూసుకున్న అనంతరమే ఆయన మనఃశాంతితో తుది శ్వాస విడిచారు అని నట్టికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.


Click it and Unblock the Notifications











