పవన్ కల్యాణ్‌కి ఖుషి లాగే..నాకు కూడా
పవన్ కల్యాణ్‌కి 'ఖుషి' ఎలాగో, నాకు 'ఇష్క్'అని హీరో నితిన్ అన్నారు. నిత్యామీనన్ కాంబినేషన్ లో నితిన్ చేసిన 'ఇష్క్' సినిమా విడుదలై యాభై రోజులు పూర్తి చేసుకుంది. విక్రమ్‌కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విక్రమ్‌గౌడ్ నిర్మించారు. సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కేక్ కోసి యాభై రోజుల ఆనందాన్ని యూనిట్ సభ్యులతో పంచుకొన్న నితిన్ ఇలా స్పందించారు.
అలాగే .."చాలా రోజుల తర్వాత నాకు లభించిన పెద్ద హిట్ 'ఇష్క్'. 'జయం' తర్వాత అంతటి వసూళ్లను సాధించిన సినిమా. దాదాపు 60 కేంద్రాల్లో యాభై రోజులు ఆడటం సంతోషంగా ఉంది. ప్రధాన కేంద్రాల్లో ఇప్పటికీ మంచి వసూళ్లు వస్తున్నాయి.'ఇష్క్'తో నాకు సెకండ్ బ్రేక్ వచ్చింది. రాబోయే రోజుల్లో బెల్లంకొండ సురేశ్ నిర్మించే ఓ సినిమా, గౌతమ్ మీనన్ ప్రొడక్షన్‌లో ఓ సినిమా, 'ఇష్క్'ని తీసిన 'శ్రేష్ట్ మూవీస్ తీసే మరో సినిమా చేయబోతున్నా'' అని చెప్పారు.
ఇష్క్ లో మరో కీలక పాత్ర చేసిన నటుడు అజయ్ మాట్లాడుతూ "ఏడేళ్ల తర్వాత నితిన్‌కు పెద్ద హిట్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా బాగా చూస్తున్నందువల్లే ఈ సినిమాకి ఈ విజయం దక్కింది'' అన్నారు. నిర్మాత విక్రమ్‌గౌడ్ మాట్లాడుతూ "ఈ సినిమాతో సినీ పరిశ్రమలోకి వస్తుంటే చాలామంది భయపెట్టారు. కానీ మంచి సినిమా తీస్తే తప్పకుండా ఆదరిస్తామని ప్రేక్షకులు నిరూపించారు'' అని చెప్పారు.
ఇక ఇష్క్ చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్. 13బి తో తనదంటూ ఓ ముద్రవేసుకున్న దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని యువతకు నచ్చేలా తీర్చి దిద్దారు. అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన నిత్యామీనన్ సైతం సినిమాను నిలబెట్టడంతో సాయిపడింది. అనూప్ రూబెన్స్ పాటలు,పి సి శ్రీరాం కెమెరా వర్క్ సినిమాకు ఎస్సెట్ గా నిలిచాయి. చాలా గ్యాప్ తర్వాత తనకు హిట్ రావటంతో నితిన్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











