‘గబ్బర్ సింగ్’ గణేష్ ఇంటిపై ఐటి దాడులు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'గబ్బర్ సింగ్' చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ఇంటిపై సోమవారం ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడి చేసారు. ఆయన ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన లెక్కపత్రాలను సోదా చేయడం ప్రారంభించారు. ఐటి అధికారులు ఏక కాలంలో ఆయన ఇల్లు, ఆఫీస్ లపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన గణేష్....'ఆంజనేయులు' చిత్రంతో చిత్రంతో ఒక్క సారిగా నిర్మాతగా మారడం అందరి ఆశ్యర్యానికి గురి చేసింది. ఆ వెంటనే ఆయన టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో 'తీన్ మార్', 'గబ్బర్ సింగ్' చిత్రాలను నిర్మించారు. గబ్బర్ సింగ్ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ కావడంతో బండ్ల గణేష్ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.
ప్రస్తుతం బండ్ల గణేష్ జూ ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రం చేస్తున్నారు. అదే విధంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో చిత్రం కూడా నిర్మిస్తున్నారు. త్వరలో గణేష్ మహేష్ బాబుతో 'టపోరి' అనే టైటిల్ తో సినిమా చేయబోతున్నట్లు టాక్. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఏకకాలంలో నిర్మాత గణేష్ ఇన్ని పెద్ద సినిమాలు ఎలా నిర్మిస్తున్నారు? ఇంత భారీ పెట్టుబడి ఎలా పెడుతున్నారనే విషయాలపై ఐటి అధికారుల్లో అనుమానాలు రావడంతో ఈ మెరుపు దాడి చేసినట్లు తెలుస్తోంది. సోదాల అనంతరం పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఈ సాయంత్రం వరకు అధికారుల సోదాలు కొనసాగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











