700 కోట్ల ఆదాయం విషయంలో అనుమానాలు.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ ఇళ్లపై ఐటీ దాడులు!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు.. వారి ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ తెలుగు సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంపై కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు దాడులు చేసినట్లు తెలిసింది. అయితే దాడుల విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు.
పుష్ప సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకనిర్మాతలు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండానే తెరకెక్కిన ఈ సినిమా అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మాణ సారథ్యంలో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, చేకూరి మోహన్ లు పుష్ప-1 మూవీని నిర్మించారు.

ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. దీంతో ఆయన ఇంటిపై ఆఫీస్ పై కూడా సెర్చింగ్ చేపట్టారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దాదాపు 700 కోట్ల రూపాయల వరకు వివిధ రూపాల్లో నగదు సమకూర్చుకుని జీఎస్టీ సరిగా కట్టలేదనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. అందుకే ఆ కేసు విషయంలో ఐటీ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.
175 నుంచి 200 కోట్ల రూపాయల వ్యయంతో తీసిన పుష్ప పార్ట్ 1 కలెక్షన్లతో దూసుకుపోయింది. ఏకంగా 350 నుంచి 420 కోట్ల రూపాయలు రాబట్టినట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇటీవలే దీనికి సీక్వెల్ గా తీస్తున్న పుష్ప-2 ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.
ఇది కూడా అంచనాలు మరింతగా పెంచేసింది. ఈ ఏడాదిలో సినిమా కూడా విడుదల కానుంది. ఇదిలా ఉండగా.. పుష్ప-2 ట్రైలర్ విడుదలైన వారంలోనే ఐటీ అధికారుల కన్ను ఈ సినీ నిర్మాతలు, దర్శకుడిపై పడింది.
ఈరోజు ఉదయం వారి కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రధానంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. అలాగే సినిమా ఆదాయ వ్యయాలను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అదే విధంగా పుష్ప-2 బడ్జెట్ ను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం పుష్ప నిర్మాతలు దర్శకుడి ఇంటిపై ఐటీ దాడుల వ్యవహారం సంచలనంగా మారింది.
అంతేకాకుండా జూబ్లీహిల్స్‌లోని యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, వారి ప్రమోటర్ల ప్రాంగణంలో అధికారులు ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారట. హవాలా మార్గంలో నిధుల మళ్లింపు ద్వారా ప్రమోటర్లు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు ఐటీకీ సమాచారం అందిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











