'గబ్బర్ సింగ్' ఆర్థిక లావాదేవీలపై ఆరా!
హైదరాబాద్: నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కార్యాలయంలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు బృందాలుగా జూబ్లీహిల్స్‌లోని కార్యాలయానికి వచ్చిన ఐటీ అధికారులు ముందుగా గణేశ్ ఉన్నారా? లేరా? అన్న సమాచారాన్ని ధ్రువీకరించుకున్నారు. తర్వాత సోదాల సమాచారాన్ని వివరించారు. గతేడాది ఆయన నిర్మించిన గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే వారు సోదాలు చేశారని తెలిసింది. కొన్ని నెలల కిందట గణేశ్ కార్యాలయంలో ఐటీ అధికారులు సర్వే నిర్వహించారు.
మొన్నటికి మొన్న దిల్ రాజు, దానయ్య నివాసాల్లో తనిఖీలు జరిపిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు... సోమవారం నిర్మాత బండ్ల గణేశ్ నివాసంపై దాడి చేశారు. బండ్ల గణేశ్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'బాద్‌షా' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సుమారు రూ.45 కోట్లతో నిర్మిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.
మరోవైపు... బండ్ల గణేశ్ కొన్నాళ్ల క్రితం ఓ దర్శకుడికి రూ.45 లక్షల విలువైన యాష్‌ట్రేను కూడా బహూకరించారు. ఈ నేపథ్యంలోనే గణేశ్‌పై ఐటీ అధికారులు దృష్టి సారించడం గమనార్హం. సోమవారం రాత్రి పొద్దుపోయేదాకా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా పలు రికార్డులను పరిశీలించిన అధికారులు వాటిలో కొన్నింటిని తీసుకెళ్లినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications












