సిద్ధార్థ-సమంత ‘జబర్దస్త్’ ఆడియో రిలీజ్ డేట్
హైదరాబాద్: నందిని రెడ్డి దర్శకత్వం లో హీరో సిద్దార్థ మరియు సమంత జంటగా రూపొందుతున్న సినిమా 'జబర్దస్త్'. నిత్యా మీనన్ కూడా ముఖ్య పాత్రను పోషిస్తోంది. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ డేట్ ఖరారైంది. జనవరి 27న హైదరాబాద్ లో ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే ఈచిత్రం ఫస్ట్ కాపీ సిద్దం అయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఫస్ట్ కాపీ చూసిన అనంతరం హీరో సిద్ధార్థ ట్విట్టర్ ద్వారా తన అనుభవాలను పంచుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని, నా కెరీర్లో తొలిసారి లేడీ డైరెక్టర్ తో చేసాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా హిట్టవుతుందనే నమ్మకం ఉందని సిద్ధార్థ ట్వీట్ చేసారు.
'జబర్దస్త్' చిత్రాన్ని దర్శకుడు లింగుసామి తమ తిరుపతి బ్రదర్స్ బ్యానర్ పై తమిళంలోకి అనువదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనువాదపు హక్కులను ఆయన సొంతం చేసుకున్నారు. తమిళంలో దీనికి 'డుం డుం పీ పీ' అనే టైటిల్ ఖరారు చేశారు.
వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈచిత్రం డిసెంబర్ నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ థియేటర్ల సమస్య, వరుస సినిమాల విడుదల చేపథ్యంలో విడుదలను 2013 వాయిదా వేసారు. డిసెంబర్లో బెల్లంకొండ 'గజరాజు' అనే తమిళ అనువాద చిత్రాన్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసారు. దీంతో థియేటర్ల సమస్య ఏర్పడింది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి .మహేంద్రబాబు, నిర్మాత: బెల్లంకొండ సురేష్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బి.వి.నందినిరెడ్డి.


Click it and Unblock the Notifications











